Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాలీ మాట్లాడే ‘మియా ముస్లింలు’ స్థానికులుగా గుర్తింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. ఈ నెల ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో మియా కమ్యూనిటీకి గుర్తింపు రావాలంటే ఆ సమాజంలోని ప్రజలు కొన్ని సాంస్కృతిక పద్ధతులు మరియు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హిమంత శర్మ నొక్కి చెప్పారు. కుటుంబం ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలని, బహుభార్యత్వాన్ని నిలిపేయాలని, మైనర్ కుమార్తెల వివాహాలను నిరోధించాలని మియా ముస్లింలకు స్పష్టం చేశారు.
Read Also: RKS Bhadauria: బీజేపీలోకి భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా..
‘‘మియాలు(బెంగాలీ మాట్లాడే ముస్లింలు) స్థానికులా, కాదా అనేది వేరే విషయం. మనం చెప్పేది ఏంటంటే, వారు స్వదేశీగా ఉండటానికి ప్రయత్నిస్తే మాకు ఇబ్బంది లేదు. కానీ దాని కోసం వారు బాల్యవివాహాలను, బహుభార్యత్వాన్ని వదులుకోవాలి. మహిళల విద్యను ప్రోత్సహించాలి’’ అని శనివారం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. అస్సామీ సాంస్కృతిక విలువను గౌరవించడం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు. కొన్ని సమూహాలు ‘సత్రాల’(వైష్ణవ మఠాలు) భూములను ఆక్రమించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. మియాలు స్వదేశీయులు కావడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ వారికి ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉండకూడదు, అది అస్సామీ సంస్కృతి కాదు. వైష్ణమ మఠాల భూమిని ఎలా ఆక్రమించుకుని స్వదేశీయులుగా ఉండాలని అనుకుంటున్నారు..? అని సీఎం ప్రశ్నించారు. మియాలు మదర్సాలకు దూరంగా ఉండాలని, వారు మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
అస్సాంలోని హిమంత శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2022లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చింది. అనేక మంది వృద్ధులు పలుమార్లు వివాహం చేసుకున్నారని, వారి భార్యలు ఎక్కువ యవతే అని, సమాజంలోని పేద వర్గానికి చెందిన యువతే ఉన్నారని హిమంత ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఫిబ్రవరి 2023లో 3483 మందిని అరెస్ట్ చేసి 4515 కేసులు పెట్టింది. అక్టోబర్ నెలలో 915 మందిని పట్టుకుని 710 కేసులు నమోదు చేసింది. బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్‌కి చెందిన ముస్లింలు (1971కి ముందు తూర్పు పాకిస్తాన్) నుంచి అస్సాంలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. అస్సాంలోని 126 నియోజకవర్గాలకు గానూ 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంది.