కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రకాల ఎంట్రన్స్ లు, పరీక్షలు వాయిదాపడ్డాయి. తాజాగా నీట్ ఎండీఎస్-2022 పరీక్షను 4-6 వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల మార్చి 31, 2022 లోపు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన బీడీఎస్ విద్యార్థులకు నీట్ ఎండీఎస్ పరీక్ష రాయడానికి అర్హత లభిస్తుంది. కొవిడ్ నేపథ్యంలో దంత వైద్య విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయలేకపోతున్నారు. దీంతో కాస్త సమయం పొడిగించాలని ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
ఈ క్రమంలో ఆ గడువు తేదీని పొడిగించడమే కాకుండా.. ఈ విద్యార్థులు నీట్ ఎండీఎస్ పరీక్ష రాయడానికి వీలుగా ఆ తేదీని కూడా మార్చాలని కొన్ని దంత వైద్య కళాశాలలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి.
దీంతో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ఆరోగ్యశాఖను ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 2022తో పూర్తి కావాల్సిన ఇంటర్న్‌షిప్ గడువును అదే సంవత్సరం జులై 31 వరకూ పొడిగించింది. ఈ గడువు నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన విద్యార్థులు నీట్ ఎండీఎస్ రాయడానికి అర్హత పొందుతారని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే నీట్ పీజీ దంత వైద్య ప్రవేశ పరీక్ష తేదీని ఇంకా నిర్ణయించలేదు. నాలుగు నుంచి ఆరు వారాల అనంతరం పరీక్ష వుంటుందని భావిస్తున్నారు.