Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) అధినేత నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భారతదేశంతో సత్సంబంధాల ప్రాముఖ్యతను చెప్పినందుకు, కార్గిల్ ప్లాన్ వ్యతిరేకించినందుకు అప్పటి జనరల్ పర్వేజ్ ముషారప్ 1999లో తన ప్రభుత్వాన్ని దించేశారని శనివారం అన్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన తనను ముందస్తుగా ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.
‘‘ నేను 1993, 1999లో ఎందుకు ప్రధాని పదవి నుంచి తొలగించబడ్డానో చెప్పాలి. నేను కార్గిల్ ప్లాన్‌ని వ్యతిరేకించినప్పుడు, నన్ను(జనరల్ పర్వేజ్ ముషారఫ్) పదవీ నుంచి దింపేశాడు. ఆ తర్వాత నేను చెప్పింది నిజమే అని తేలింది.’’ అని షరీఫ్ అన్నారు. వచ్చే ఫిబ్రవరిలో పాక్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇద్దరు భారత ప్రధానులు పాకిస్తాన్లో పర్యటించారు. దీనిని గురించి ఆయన మాట్లాడారు. వాజ్‌పేయి, నరేంద్రమోడీ లాహోర్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నవాజ్ భారతదేశంతో సంబంధాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో మన సంబంధాలు బలపరుచుకోవాలి, చైనాతో మరింత బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలి అని షరీఫ్ అన్నారు.
Read Also: Hyderabad: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్
ఆర్థిక వృద్ధిలో పాక్ పొరుగుదేశాల కన్నా వెనకబడి ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విరుచుకుపడిన షరీఫ్.. అనుభవం లేని వ్యక్తి దేశ పగ్గాలు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంతో పాక్ ఆర్థిక వ్యవస్థ పతానానికి గురైందని, ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గద్దెనెక్కి దేశాన్ని డిఫాల్ట్ నుంచి రక్షించిందని ఆయన అన్నారు. 2017లో తన ప్రభుత్వాన్ని దించేసి దేశాన్ని నాశనం చేసినందుకు మాజీ సైనిక జనరల్స్, న్యాయమూర్తులు జవాబుదారీ వహించాలని షరీఫ్ డిమాండ్ చేశారు. దేశ భక్తి ఉన్న వారు తమ దేశాన్ని ఇలా చేయరని మండిపడ్డారు.
విలాసవంతమైన కార్లలో తిరిగేందుకు తాను అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, అయితే దేశాన్ని నాశనం చేసిన వారు, తనపై తప్పుడు కేసులు బనాయించి వారు జవాబుదారీగా ఉండాలన్నారు. యూకేలో 4 ఏళ్లు ప్రవాసంలో గడిపిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల సొంత దేశానికి వచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ టిక్కెట్ల కోసం షరీఫ్ ప్రతిరోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.