Navjot Sidhu: 34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ 10 నెలల తర్వాత ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కాగానే బీజేపీ, ప్రధాని మోదీ టార్గెట్ గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందని అంటూ విమర్శించారు. పంజాబ్ దేశానికి రక్షణ కవచం, ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడు.. రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం వచ్చింది అంటూ సిద్ధూ కామెంట్స్ చేశారు.
బీజేపీకి ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉన్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం భావిస్తోందని ఆయన ఆరోపించారు. సిక్కు వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వెతుకుతున్న సందర్భంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమృత్ పాల్ సింగ్ ప్రైవేట్ సైన్యం రాష్ట్రంలో సమస్యలు సృష్టించడానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర జరుగుతోందని, పంజాబ్ ను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తతో కలిసి నేను గోడలా నిలుస్తానని అన్నారు.
పంజాబ్ ప్రజలను ఎందుకు మోసం చేశావని సీఎం భగవంత్ మాన్ ను ప్రశ్నించారు. ఎన్నికల ముందు పెద్దపెద్ద వాగ్థానాలు చేశారు, జోకులు పేల్చారు, కానీ మీరు ఇప్పుడు కాగితంపై మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆరోపించారు. గతేడాది పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆ తరువాత రోడ్ రేజ్ కేసులో సిద్ధూకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. పంజాబ్ ఓటమి అనంతరం సిద్దూ తన పీసీసీ పదవికి రాజీనామా చేశారు.