తమిళనాడులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య అగ్ని రాజుకుంది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ అనే పదం పలకకుండా దాటవేశారని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. చెన్నైలోని దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరిగింది. ఇదే ఈవెంట్‌లో హిందీ మాసోత్సవం కూడా నిర్వహించారు. హిందీని, హిందీ భాషేతర రాష్ట్రాల ఈవెంట్‌ను కలిపి నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ తొలుత తప్పుబట్టారు. ఈవెంట్ సందర్భంగా రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తూ.. ద్రవిడ అనే పదాన్ని గాయకులు దాటవేయడంపై వివాదం నెలకొంది. దీనిపై దూరదర్శన్ తమిళ్ క్షమాపణ కూడా చెప్పింది. గాయకుల పొరపాటుగా పేర్కొంది.
ఇది కూడా చదవండి: Delhi: తీహార్ జైలు దగ్గర సీఎం అతిషి హడావుడి.. సత్యేందర్ జైన్‌కు స్వాగతం
కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ కూడా ‘ద్రవిడ’ అనే పదాన్ని ఉచ్చరించకపోవడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన.. గవర్నర్ పదవికి ఏ మాత్రం అర్హులు కాదంటూ ఆరోపించారు. రాష్ట్ర గేయంలో ఆ పదాన్ని ఉచ్చరించకపోవడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఒకవేళ జాతీయ గీతంలో ద్రవిడ అనే పదం వస్తే ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా తమిళనాడును, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ను తక్షణమే రీకాల్ చేయాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అభ్యంతరాలపై గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఈ వ్యవహారంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి తప్పేమీ లేదని పేర్కొంది. ఆయన హాజరైన కార్యక్రమంలో గేయాన్ని ఆలపించిన బృందం పొరపాటుగా పేర్కొంది. ఈ విషయం వెంటనే నిర్వాహకుల దృష్టికి తేవడంతో పాటు, సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు గవర్నర్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు.
తమిళ సంస్కృతి, వారసత్వాన్ని పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అలాగే తాను కూడా అలాగే పని చేస్తానని గవర్నర్ రవి పేర్కొన్నారు. గవర్నర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం సరికాదని.. తప్పుడు ఆరోపణలు చేయడం చౌకబారు వ్యవహారం అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..