Anurag Thakur: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే నేత, రాష్ట్రమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు ఇంకా చల్లారడం లేదు. బీజేపీ, కేంద్రమంత్రులు డీఎంకే పార్టీపై ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అనుకుంటున్నారని, ‘నఫ్రత్ కా మెగా మాల్’(ద్వేషానికి పెద్ద షాపింగ్ మాల్)ని ప్రారంభించారని అన్నారు.
Read Also: Pig kidney In Human: మానవశరీరంలో పంది కిడ్నీ.. భవిష్యత్తుపై ఆశలు..
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘మెహబ్బత్ కి దుకాణ్’(ప్రేమ దుకాణం) గురించి నాకు తెలియదే కానీ కొంత మంది ‘నఫ్రత్ కా మెగా మాల్’ తెరిచారని ఇండియా కూటమికి, రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అంటున్నారని, వారికి రాహుల్ గాంధీ లైసెన్సు ఇచ్చారని కేంద్రమంత్రి దుయ్యబట్టారు.
ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో రచయితల సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దాన్ని నిర్మూలించాలని, డెంగ్యూ, మలేరియాతో పోల్చాడు. దీనికి తోడుగా డీఎంకే పార్టీకే చెందిన నేత ఏ రాజా సనాతన ధర్మాన్ని కుష్టు, ఎయిడ్స్ తో పోల్చడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు మండిపడ్డాయి. బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఇండియా కూటమికి హిందుమతం అంటే ద్వేషం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.