Maternity Leave: ప్రసూతి సెలవు అనేది మహిళల ప్రసూతి ప్రయోజనాల్లో అంతర్భాగమని, మహిళల పునరుత్పత్తి హక్కుల్లో కీలకమైన భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా ఒక మహిళ ప్రసూతి సెలవుల హక్కుల్ని హరించలేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తన రెండో వివాహం ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసూతి సెలవు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ని విచారిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.
ఆమెకు మొదటి వివాహం నుంచి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారనే కారణంతో ఆమెకు సెలవు నిరాకరించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే మెటర్నిటీ బెన్‌ఫిట్స్ ఉండాలనే నియమం ఉంది. అయితే, తాను తన మొదటి ఇద్దరు పిల్లల సమయంలో ఉద్యోగం చేయలేదని, ఎలాంటి ప్రసూతి సెలవులు, ప్రయోజనాలు పొందలేదని మహిళ పేర్కొంది. ఆమె తన రెండో వివాహం తర్వాతే ఉద్యోగం ప్రారంభించానని, ఇప్పుడు మూడోవ బిడ్డకు ప్రయోజనాలను పొందాలనుకుంటున్నానని ఆమె కోర్టుకు చెప్పింది.
Read Also: India Pakistan: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసేందుకు భారత్ మాస్టర్ ప్లాన్..
తమిళనాడులో గతంలో ప్రసూతి ప్రయోజనాల నిబంధనలు ఆమెకు లభించకపోవడంతో ఆమెకు ప్రసూతి సెలవులు మంజూరు చేయకూడదనే రాష్ట్రం నిర్ణయం ఆమె ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిందని పిటిషనర్ తరపున వాదించిన న్యాయవాది కె.వి. ముత్తుకుమార్ అన్నారు. ఆమె పిటిషన్‌కి సుప్రీంకోర్టు మద్దతు లభించింది. ప్రసూతి సెలవులను ఇప్పుడు ప్రాథమిక పునరుత్పత్తి హక్కులలో భాగంగా గుర్తిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
మెటర్నిటీ లీవ్ విధానం ప్రకారం, శిశువు జన్మించిన తర్వాత ఏ స్త్రీ అయినా 12 వారాల వరకు వేతనంతో కూడి ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. 2017లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రసూతి ప్రయోజన చట్టానికి గణనీయమైన సవరణలు తీసుకువచ్చారు. అందరు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచారు. దీంతో పాటు, బిడ్డను దత్తత తీసుకున్న మహిళలు కూడా 12 వారాల ప్రసూతి సెలవులకు అర్హులు.