Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటకలో సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. కర్ణాటక ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ద్వేషంతో చేసే రాజకీయాలు ముగిశాయని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రేమతో విజయం సాధించామని అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ద్వేషం యొక్క మార్కెట్ మూసివేయబడింది మరియు ప్రేమ దుకాణాలు తెరవబడ్డాయి” అని ఆయన అన్నారు.
Read Also: Chicken Price : కోడి మాంసం ధరలకు రెక్కలు.. ఆందోళనలో మాంసాహార ప్రియులు
కర్ణాటక ఎన్నికల్లో పేద ప్రజల తరుపున పోరాడమని, పేదల శక్తి విజయం సాధించిందని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పునారావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశంలో తాము చేసిన 5 హామీలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. కర్ణాటకలోని ప్రజలు క్రోనీ కాపిటలిస్టులను ఓడించారని, ఈ పోరాటంలో మేం ద్వేషంతో పోరాడలేదని ఆయన అన్నారు.
మొత్తం 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ 138 స్థానాల్లో, బీజేపీ 63 స్థానాల్లో, జేడీఎస్ 20 స్థానాల్లో గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కర్ణాటకలో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 113, ఈ ఫిగర్ ను దాటి కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన ఓటమిని అంగీకరించాడు.