Mangaluru Autorickshaw Blast: మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసులో ‘‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’’గా పేర్కొన్నారు కర్ణాటక పోలీసులు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళూర్ నగరంలో శనివారం ఆటోరిక్షాలో పేలుడు సంభవించింది. అయితే ఇది ప్రమాదవశాత్తు పేలిన సంఘటన కాదని.. తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశం ఇందులో ఉందని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ ఆదివారం అన్నారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లుగా ఆయన ధృవీకరించారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కర్ణాటక పోలీసులు సహకరిస్తున్నారని ఆ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు.
మంగళూర్ లో నిన్న జరిగిన పేలుడుపై రాష్ట్ర పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆటోరిక్షాలో ‘‘ బ్యాటరీలతో కాలిపోయిన ప్రెషర్ కుక్కర్’’ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు, నిర్మాణ పనులు జరుగుతన్న ప్రదేశంలో ఆటో రిక్షా ఆగిపోయిన సమయంలో పేలుడు సంభవించడంతో డ్రైవర్ తో పాటు మరో ప్రయాణికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఘటనకు గల కారణాలను అన్వేషించింది. ముందుగా దీన్ని ప్రమాదవశాత్తుగా జరిగిన ఘటనగా భావించారు. ఆ తరువాత ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్థారణకు వచ్చారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఎన్‌కౌంటర్.. నాన్ లోకల్స్‌ని చంపుతున్న ఉగ్రవాది హతం
లొకేషన్ లోని సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన తర్వాత పోలీసులు ఉగ్రకుట్రగా అనుమానిస్తున్నారు. చిన్న పేలుడు సంభవించిన తర్వాత ఆటోరిక్షాకు మంటలు అంటుకున్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు.
ఈ ఘటనకు ముందు గత నెల దీపావళికి ముందు తమిళనాడు కోయంబత్తూర్ లో ఓ గుడి సమీపంలో కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మరణించారు. ఇది స్పష్టంగా ఉగ్రదాడిగా తర్వాత తేలింది. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుపై తమిళనాడు సర్కార్, బీజేపీ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి.