Encounter breaks out between security forces and terrorists in J&K’s Anantnag: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆదివారం తెల్లవారుజామున అనంత్ నాగ్ జిల్లాలో భద్రతాబలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కి చెందిన హైబ్రీడ్ ఉగ్రవాదిని మట్టుపెట్టారు కాశ్మీర్ పోలీసులు. ఉగ్రవాదుల రహస్యస్థావరాలను గుర్తించే క్రమంలో ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని బిజ్ బెహారాలోని చెకీ దుడూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు.
Read Also: Himanta Biswa Sarma: మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదు.. చరిత్రను తిరగరాయాలి..
చనిపోయిన ఉగ్రవాదిని కుల్గామ్‌కు చెందిన సజ్జాన్ తంత్రేగా పోలీసులు గుర్తించారు. సజ్జాన్ లష్కరే ఉగ్రవాదిగా క్రియాశీలకంగా ఉన్నాడు. నవంబర్ 13న బిజ్ బెహరాలోని రఖ్‌మోమెన్‌లో స్థానికేతర కూలీని హత్య చేసిన కేసులో సజ్జాన్ ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఈ నెల 13న బిజ్ బెహరాలోని రఖ్ మోమెన్ లో బయట పని చేసుకుంటున్న ఇద్దరు కూలీలపై సజ్జాన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చోటా ప్రసాద్ అనే కూలీ మరణించాడు. ఈ మాడ్యుల్ కు చెందిన మరికొంత మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో టెర్రరిస్టులు కొత్తగా హైబ్రీడ్ టెర్రరిజానికి తెరలేపారు. జనాల్లో కలిసి ఉంటూనే నాన్ లోకల్స్, హిందువులు, కాశ్మీరీ పండిట్లు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉన్నవారిని చంపి పారిపోతున్నారు. ఇలా చాలా మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని వెతికి మరీ చంపేస్తున్నాయి భద్రతా బలగాలు.