Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని సోమవారం ఆరోపించారు. కూచ్ బెహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె… బీజేపీ ప్రజల ఆహార అలవాట్లను నిర్దేశిస్తోందని, వ్యక్తుల స్వేచ్ఛకు ముప్పుగా వాటిల్లిందని దుయ్యబట్టారు. ‘‘మీరు ఏం తినాలో వారే నిర్ణయిస్తారు. వారు మిమ్మల్ని ఉదయం టీతో గోమూత్రం తాగమని, మధ్యాహ్నం ఆవు పేడ తినమని అడుగుతారు. వారు మీ జీవితంలోని ప్రతీ అంశాన్ని నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరు ఏం తింటారు, మీరు ఎలా నిద్రపోతారో అనే విషయాలను కూడా నియంత్రించాలని బీజేపీ అనుకుంటోంది’’ అని మమతా బెనర్జీ ఆరోపించారు. ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నవరాత్రుల సమయంలో చేపల్ని తినడంపై బీజేపీ విమర్శించిన నేపథ్యంలో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: PM Modi: డీఎంకేపై కోపంతో బీజేపీ వైపు తమిళ ప్రజలు.. అన్నామలైపై ప్రధాని ప్రశంసలు..
దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడాలంటే బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టాలని, అప్పుడే దేశం స్వతంత్రంగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలు ఉండవని, దేశంలో ఒకే నాయకుడు, ఒకే దేశం, ఒకే భాష, ఒకే భోజనాన్ని బీజేపీ కోరుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఏప్రిల్ 17న రామనమమి రోజున హింసను, అల్లర్లను ప్రేరేపించడానికి బీజేపీ ప్రయత్ని్స్తోందని ఆమె ఆరోపించారు.
బీజేపీ కాషాయ భావజాలంతో మన చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల్లోకి చొరబడ్డారని, వారి ఎజెండా సంఘర్షణ, గందరగోళాన్ని సృష్టించడమే అని ఆరోపించారు. శాంతి, ఐక్యతను కాపాడాలని ప్రతీ ఒక్కరిని నేను కోరుతున్నానని, మనం వారి చేతుల్లోకి వెళ్లొద్దని, సామరస్యం-సంఘీభావానికి గుర్తుగా ఆ రోజును జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీతో సీపీఎం కుమ్మక్కైందని ఆరోపించింది. మమతా బెనర్జీ బెంగాల్‌లో ఒంటరిగా పోరాడుతోంది, కాంగ్రెస్ సీపీఎంలు బీజేపీకి సహకరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో ఒక్క అల్లర్లు జరిగినా ఎన్నికల సంఘం ముందు నిరాహారదీక్ష చేస్తానన్నారు. ఈ రోజు బీజేపీ సూచనల మేరకే ముర్షిదాబాద్ డీఐజీని మార్చింది, ముర్షిదాబాద్, మాల్దాలో అల్లర్లు జరిగితే ఆ బాధ్యత ఎన్నిక కమిషన్‌దే అని చెప్పారు.