మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడింది. డిసెంబర్ 14న (శనివారం) మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ సీనియర్ నేత వెల్లడించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి దేవేంద్ర ఫడ్నవిస్ హస్తినకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌లను కలవనున్నారు. అలాగే ప్రధాని మోడీతో కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Atul Subhash Suicide: సంచలనంగా టెక్కీ సూసైడ్ కేస్.. వరకట్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం చాలా గందరగోళం జరిగింది. దాదాపు ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మరోసారి ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని, బీహార్ ఫార్ములా అమలు చేయాలని శివసేన పట్టుపట్టింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అయింది. మొత్తానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రంగంలోకి దిగాక పరిస్థితులు చక్కబడ్డాయి.
ఇది కూడా చదవండి: C-Section Delivery Back Pain: సి-సెక్షన్ డెలివరీ వెన్నునొప్పికి దారి తీస్తుందా? నిజమెంత?
డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం కేబినెట్ విస్తరణపై కసరత్తు జరుగుతోంది. అయితే హోంమంత్రి శాఖను శివసేన అడుగుతోంది. దీనిపై బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక 7:7:7 నిష్పత్తిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీకి కేబినెట్ పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. ఫడ్నవిస్ ఏ విధంగా మంత్రివర్గ విస్తరణ చేస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Back Pain: నడుమునొప్పితో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే..