బీహార్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులను ఓ లోకో పైలట్ మధ్య వదిలేసి వెళ్లిపోయాడు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చకుండా మద్యంమత్తులో మునిగితేలాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి లోకల్ రైలు సహర్సాకు బయలుదేరింది. గంట ప్రయాణం తర్వాత రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఓ చోట ఆగింది. దీంతో లోకో పైలెట్ రైలు దిగి వెళ్లిపోయాడు. అయితే క్రాసింగ్ తర్వాత కూడా రైలు ఎంతకీ కదల్లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేయడంతో పోలీసులు లోకో పైలట్ కోసం తీవ్రంగా గాలించారు.
చివరకు లోకో పైలట్ తప్పతాగిన స్థితిలో పోలీసులకు కనిపించాడు. అతడు రైలు దిగి మద్యం దుకాణానికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉండటంతో అతడికి మద్యం ఎవరు విక్రయించారో అంతుచిక్కని ప్రశ్నలా మారిందని పోలీసులు వాపోతున్నారు. లోకోపైలట్ మద్యం తాగి అక్కడే పడిపోయాడని.. దీంతో అదే రైలులో ప్రయాణిస్తున్న అసిస్టెంట్ లోకో పైలట్ విధులు నిర్వహించాడని పోలీసులు తెలిపారు. లోకోపైలట్ తీరుపై విచారణ సాగుతోందన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరినట్లు సమస్తిపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ అగర్వాల్ పేర్కొన్నారు.
Marriage: 15 ఏళ్లుగా సహజీవనం.. ఒకేసారి ముగ్గురు మహిళలతో పెళ్లి..