UTTAR PRADESH: ఉత్తర్ ప్రదేశ్‌లో శివభక్తులు చేసే ‘కన్వర్ యాత్ర’కు ముజఫర్ నగర్ పోలీసులు పెట్టిన రూల్స్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. యాత్రా మార్గంలో తినుబండారాల విక్రేతలు తమ పేర్లను తప్పకుండా ప్రదర్శించాలని యూపీ పోలీసులు ఆదేశించారు. అయితే, దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని ‘వర్ణ వివక్ష’, హిట్లర్ విధానాలుగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శివ భక్తులు వార్షిక తీర్థయాత్ర అయిన కన్వర్ యాత్ర జూలై 22న ప్రారంభం అవుతోంది.
మతపరమైన ఊరేగింపులో ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకు మార్గంలోని అన్ని ఫుడ్ స్టాల్స్ వాటి యజమానుల పేరును ప్రముఖంగా ప్రదర్శించాలని ముజఫర్ నగర్ పోలీసులు ఆదేశించారు. కన్వర్ యాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ‘‘ మా పరిధిలోని 240 కి.మీలోని అన్ని తినుబండారాలు, హోటళ్లు, దాబాలు మరియు టేలాలు (రోడ్డు పక్కన బండ్లు) వాటి యజమానులు లేదా దుకాణాన్ని నడుపుతున్న వారి పేర్లను ప్రదర్శించాలని ఆదేశించబడింది. కాన్వారియాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా, భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు రాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ప్రతీ ఒక్కరు దీనిని ఆచరించాలి’’ అని జిల్లా ఎస్పీ అభిషేక్ సింగ్ అన్నారు.
Read Also: Encounter: గడ్చిరోలి జిల్లాలో మూడేళ్లలో 80 మంది మావోయిస్టుల హతం..
ముస్లిం యజమానుల దుకాణాల్లో యాత్రికులు ఏం కొనకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ‘‘ ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆదేశం ప్రకారం.. ప్రతి ఫుడ్ షాప్ యజమాని తన పేరును బోర్డుపై పెట్టాలి. తద్వారా కన్వర్ యాత్రికులు ముస్లిం దుకాణాల్లో ఏం కొనకూడదు. దీనిని హిట్లర్ వర్ణ వివక్షగా పిలుస్తారు. ‘‘జూడెన్ బాయ్‌కాట్’ అని పిలుస్తారు’’ అంటూ ఓవైసీ ట్వీట్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ పాటల రచయిత్ జావేద్ అక్తర్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ‘‘ముజఫర్‌నగర్ యుపి పోలీసులు సమీప భవిష్యత్తులో ఒక నిర్దిష్ట మతపరమైన ఊరేగింపు మార్గంలో అన్ని దుకాణాలు రెస్టారెంట్లు మరియు వాహనాలు కూడా వాటి యజమాని పేరును ప్రముఖంగా మరియు స్పష్టంగా చూపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు?. నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇళ్లకు ప్రత్యేకమైన గుర్తు పెట్టేవారు’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో యూపీ పోలీసులు దీని వెనక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. భక్తుల సౌలభ్యం కోసమే అని వెల్లడించారు