మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మూడేళ్లలో 80 మంది మావోయిస్టుల హతమయ్యారు. 2021 నుంచి ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. 102 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై పోలీసుల ప్రకటన విడుదల చేశారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో
12 మంది మావోయిస్టులు హతమయిన విషయం తెలిసిందే. రాబోయే నక్సల్ వీక్ (28 జూలై-03 ఆగస్టు) నేపథ్యంలో విధ్వంసక కార్యకలాపాలకు మావోయిస్టుల ప్రయత్నాన్ని గడ్చిరోలి పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురు ఏసీఎం (ఏరియా కమిటీ సభ్యుడు)తో పాటు డీవీసీఎం (డివిజనల్ కమిటీ సభ్యుడు) స్థాయి ముగ్గురు సీనియర్ కేడర్‌లు, అలాగే నలుగురు దళం సభ్యులు చనిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం నగదు రివార్డు రూ.86 లక్షలు ప్రకటించింది.
READ MORE: Jammu Kashmir: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
ఘటనా స్థలంలో పోలీసులు ఏడు ఆటోమేటిక్ ఆయుధాలు సహా 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పులతో, కోర్చి-తిపగడ్ అలాగే చట్గావ్-కసన్సూర్ ఎల్ వోఎస్ (LOS) మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. రాబోయే నక్సల్స్ వారోత్సవం (28వ తేదీ) నేపథ్యంలో విధ్వంసకర కార్యకలాపాలు నిర్వహించే లక్ష్యంతో 12 నుంచి 15 మంది కోర్చి-తిపగడ్ & చత్‌గావ్-కసన్‌సూర్ ఉమ్మడి LOS సభ్యులు వందోలి గ్రామంలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిది చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారం నిన్న ఉదయం పోలీసులకు అందింది. దీని ప్రకారం.. డీవైఎస్‌పీ (ఆపరేషన్స్) విశాల్ నాగర్‌గోజే నేతృత్వంలోని మావోయిస్టు వ్యతిరేక సి-60 స్క్వాడ్‌లోని ఏడు యూనిట్లను వెంటనే ఆ ప్రాంత శోధన కోసం పంపారు. బృందాలు ఏరియా సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా, మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వీరికి సీ-60 బృందాలు గట్టి బదులిచ్చాయి. చివరకు పోలీసుల ఒత్తిడిని గమనించిన మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు. ఎదురుకాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో వెతకగా ఏడుగురు మగ, ఐదుగురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన మావోయిస్టులను గుర్తించారు. ప్రస్తుతం గడ్చి రోలి ఆసుపత్రి మార్చురిలో మావోయిస్టుల మృత దేహాలు ఉన్నాయి.