Khawaja Asif: భారత్- పాకిస్తాన్ మధ్య ఓ వైపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ చేసిన కొన్ని ప్రకటనలు కామెడీని మించుతున్నాయి. ముఖ్యంగా, ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సొంతదేశంలోనే ట్రోల్‌కి గురవుతున్నాయి. అక్కడి ఎంపీలు రక్షణ మంత్రి దేశాన్ని నవ్వులపాలు చేస్తున్నాడని మండిపడుతున్నాయి.
ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహించింది: ఏప్రిల్ 25న, పహల్గామ్ దాడి తర్వాత యూకే స్కై న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని అంగీకరించారు. సోవియట్ యూనియన్‌కి వ్యతిరేంగా పోరాటంలో అమెరికా, బ్రిటన్ కోసం ఈ నీచమైన పని చేస్తున్నాము అని అన్నారు.
మదర్సాలు రెండో రక్షణ శ్రేణి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. మదర్సా విద్యార్థులు దేశానికి రెండో రక్షణ శ్రేణి(సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్) అని అన్నారు. సమయం వచ్చినప్పుడు వారిని 100 శాతం ఉపయోగిస్తాం అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై భారీ విమర్శలు వచ్చాయి. విద్యార్థుల మెదడుల్లో జిహాద్ భావాలను ఎక్కిస్తున్నారని, మత ఉద్రిక్తతల్ని పెంచుతున్నారని హక్కుల సంఘాలు ఆరోపించాయి.
డ్రోన్ వ్యూహం: పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత్ డ్రోన్ దాడి చేసిందని ఒప్పుకుంటూనే, డ్రోన్లను అడ్డగిస్తే, పాక్ స్థావరాలు గుర్తించే అవకాశం ఉందని చెప్పడం ఫన్నీగా మారింది. ఈ విషయాన్ని కూడా ఆయన పాక్ పార్లమెంట్‌లో చెప్పారు.
సోషల్ మీడియాలో చూశా: సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ భారత్‌కి చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చిందని ఆసిఫ్ చెప్పారు. అయితే, వీటికి ఆధారాలు ఉన్నాయా..? అని యాంకర్ ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో చూశా అని చెప్పారు. రక్షణ మంత్రిగా ఉన్న మీరు ఇలా సోషల్ మీడియా కంటెంట్ గురించి మాట్లాడటం ఏంటని యాంకర్ తీవ్రంగానే స్పందించారు.
అణ్వాయుధ ముప్పు: పాకిస్తాన్ తన ఉనికికి ముప్పు వాటిల్లితే, ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని తన భయాన్ని వ్యక్తం చేశారు. పాక్ సమా టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాక్ రక్షణ మంత్రి బాధ్యతారహితమైన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌లో సొంత ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలు జర్తాజ్ గుల్, మిస్టర్ ఆసిఫ్ వైఖరి “చాలా బాధ్యతారహితమైనది” అని అన్నారు. మీకు ఇంగ్లీష్ తెలియకుంటే అంతర్జాతీయ మీడియా ముందుకు ఎందుకు వెళ్లారు..? అని ప్రశ్నించారు. మీరు ప్రభుత్వాన్ని, దేశాన్ని ఎగతాళి చేయవద్దని ఆమె అన్నారు.