Kerala NEET exam issue: కేరళలో నీట్ ఎగ్జామ్ ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినుల లోదుస్తులు తొలగించిన ఘటనపై మహిళా, విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. కేరళలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థినులు తీవ్ర అవమానానికి లోనయ్యారు. కేరళలో మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తులను విప్పించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది విద్యార్థినులు తమ జట్టును ముందుకు వేసుకుని పరీక్ష రాయాల్సి వచ్చిందని తీవ్ర అవమానానికి లోనవుతున్నారు. కొంతమంది ఏడుస్తూనే నీట్ ఎగ్జామ్ రాశామని వెల్లడించారు. దీంతో పరీక్షపై దృష్టి సారించనట్లు బాలికలు వెల్లడించారు.
Read Also: RRR: నెట్టింట్లో తాండవం చేస్తోన్న తారక్ సీన్
ఈ నేపథ్యంలో కేరళలో నీట్ ఎగ్జామ్ ముందు స్క్రీనింగ్ సమయంలో అనేక మంది బాలికల ఇన్నర్ వేర్ తొలగించడంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇది విద్యార్థినులకు అవమానకరమని.. దారుణమని పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై స్వతంత్ర వచారణ జరగాలని బాధ్యులపై చట్టప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయ(ఎన్టీఏ)కి లేఖ రాసింది. ఈ వ్యవహారంపై కాలపరిమితితో కూడిన విచారణను కోరింది. ఈ విషయంపై న్యాయమైన విచారణ జరపాలని.. ఆరోపణలు నిజమైతే సంబంధిత చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కేరళ డీజీపీకి లేఖ రాసింది. ఈ ఘటనపై ఏ చర్యలు తీసుకున్నారో.. మూడు రోజుల్లో కమిషన్ కు తెలియజేయాలని ఆదేశించింది.