నేడు కూటమి నేతల కీలక భేటీ..
ఆంధ్రప్రదేశ్‌లో తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య నేడు కూటమి నేతల మధ్య అత్యంత ప్రాధాన్యత గల సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కలిసి సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ అంశంలో ఇప్పటికే సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక సమర్పించిన నేపథ్యంలో, ఆ నివేదికపై కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ అంశంలో కూటమి పక్షాల మధ్య ఉమ్మడి కార్యాచరణపై కూడా స్పష్టత తీసుకొచ్చే దిశగా నిర్ణయాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం కూటమి నుంచి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు..
నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామంలో 2023లో జరిగిన హత్య ఘటనలో జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు విధించింది. మరో నిందితుడికి రూ.2,000 జరిమానా విధించింది. భార్యపై అనుమానమే హత్యకు కారణమని జిల్లా కోర్టు నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. సమ్మక్క, సారక్క. కొన్నాళ్లకు భర్త పట్టించుకోక పోవటంతో పోసాని నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌కు చేరుకుని స్థానికంగా యాచిస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మెట్పల్లి ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఈ విషయం కాశీరాంకు తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయి అక్కడకు చేరుకుని భార్యపై ఆగ్రహంతో చిన్న కుమార్తె సారక్క(9)ను మంటల్లోకి నెట్టాడు. అది చూసి భయపడిన పెద్దమ్మాయి సమ్మక్క పరారైంది. తీవ్రంగా గాయపడిన సారక్కను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది. భార్య ఫిర్యాదుతో కాశీరాంపై మెండోరా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
పార్లమెంట్ మెట్లపై జారిపడ్డ శశిథరూర్.. ‘తుఫాన్‌లో మండాల్సిన దీపం’’ అంటూ వీడియో పోస్ట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుండగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేవనెత్తి అంశాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకంలోని అంశాలు లేవనెత్తడంతో అధికార పార్టీ తీవ్రంగా తిప్పికొట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభా కార్యకలాపాలు కూడా సజావుగా సాగడం లేదు. దీంతో ఎనిమిది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. దీంతో సస్పెండైన ఎంపీలంతా బుధవారం పార్లమెంట్ ద్వారం దగ్గర నిరసన తెలుపుతున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫోన్ మాట్లాడుతూ మెట్లపై నుంచి జారీ పడ్డారు. వెంటనే పక్కనే ఉన్న అఖిలేష్ యాదవ్‌తో పాటు మరికొంత మంది ఎంపీలు వెంటనే పైకి లేపారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను శశిథరూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘తుఫానులో మండాల్సిన దీపాన్ని జాగ్రత్తగా నడపాలి. నేను బాగున్నాను.’’ అంటూ శశిథరూర్ వీడియో పోస్ట్ చేస్తూ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారో అర్థం కావడం లేదు.
బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టడం తెలివితక్కువ పనే.. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే..
బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. చాలా మంది గోల్డ్, సిల్వర్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ ఈ లోహాలపై మాత్రమే పెట్టుబడి పెట్టడం అవివేకమని ఎత్తి చూపారు. భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో, నిజమైన సంపద సృష్టికి మార్గం ప్రొడక్టివ్ అసెట్స్ ద్వారా, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ద్వారా ఉంటుందని ఆయన అన్నారు. జియో బ్లాక్‌రాక్ చొరవ గురించి చర్చిస్తున్నప్పుడు, అంబానీ ఆశ్చర్యకరమైన గణాంకాలను సమర్పించారు. అతని ప్రకారం, భారతదేశం గత సంవత్సరం సుమారు $60 బిలియన్ల బంగారం, $10-15 బిలియన్ల వెండిని దిగుమతి చేసుకుంది. దీని అర్థం ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిని నేరుగా పెంచని వస్తువులలో బిలియన్ల డాలర్లు చిక్కుకున్నాయి. అంబానీ సాధారణ వాదన ఏమిటంటే బంగారం, వెండి ఆర్థిక భద్రతను అందిస్తాయి కానీ వృద్ధిని వేగవంతం చేయవు. భారతీయ పొదుపులో గణనీయమైన భాగం మూలధన మార్కెట్లలోకి వస్తే, ఆ డబ్బు కంపెనీలు, ఇన్ఫ్రా స్ట్రక్చర్, కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడి పెట్టబడుతుందని ఆయన అన్నారు. ఇది వ్యాపారాలను పెంచుతుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది. కాలక్రమేణా పెట్టుబడిదారుల సంపదను పెంచుతుంది. ఆయన సందేశం స్పష్టంగా ఉంది.. “డబ్బు ఖజానాలో కాదు, ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించాలని చెప్పారు.
ఎన్ని సిక్సర్లు బాదినా.. ఈ క్రికెటర్ రికార్డు మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేరు.. !
ప్రపంచ క్రికెట్‌లో ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రికార్డులు మాత్రం కాలం ఎంత గడిచినా చెరగవు. అలాంటి అరుదైన, అద్భుతమైన రికార్డు ఒకటి నేపాల్ స్టార్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ పేరిట ఉంది. ఎన్ని సిక్సర్లు బాదినా, ఎంత గొప్ప బ్యాటర్లు వచ్చినా.. ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యపడలేదు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్–శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. వాటిలో నేపాల్ జట్టు కూడా అర్హత సాధించడం విశేషం. రోహిత్ పౌడెల్ నాయకత్వంలో, దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నేపాల్ ఈసారి పెద్ద జట్లకు సవాల్ విసిరే స్థితిలో ఉంది. నేపాల్ తరఫున టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా దీపేంద్ర సింగ్ ఐరీ నిలిచాడు. 90 మ్యాచ్‌ల్లో 1956 పరుగులు చేశాడు.. సగటు 32.06తో 1 సెంచరీ, 10 అర్ధశతకాలు చేశాడు.. ఆ తర్వాత స్థానాల్లో కుశల్ భురతేల్ – 1807 పరుగులు (70 మ్యాచ్‌లు).. ఆసిఫ్ షేక్ – 1639 పరుగులు (68 మ్యాచ్‌లు) ఉన్నారు. దీపేంద్ర సింగ్ ఐరీ సాధించిన ఈ రికార్డు క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక అధ్యాయం. 2023 ఆసియా గేమ్స్‌లో మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో దీపేంద్ర కేవలం 9 బంతుల్లో అర్ధశతకం (50 పరుగులు) సాధించాడు. ఇది ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలోనే వేగవంతమైన అర్ధశతకం.. ఎవరూ బద్దలు కొట్టలేని ప్రపంచ రికార్డు అవడం విశేషం. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏ ఆటగాడు వరుసగా 9 బంతుల్లో 9 సిక్సర్లు కొట్టినా, దీపేంద్ర రికార్డుకు సమం మాత్రమే అవుతాడు. కానీ, దాన్ని అధిగమించడం మాత్రం సాధ్యం కాదు.
పెద్ది రాకతో అయ్యగారి ‘లెనిన్’ సినిమా పోస్ట్ పోన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ ఖరారైంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ ప్రకటన అక్కినేని యువ హీరో అఖిల్ సినిమాపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. అఖిల్ అక్కినేని నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ సమ్మర్ కానుకగా ఈ ఏడాది మే 1న విడుదల కానున్నట్లు ప్రకటించారు. అక్కినేని ఫ్యామిలీకి మే నెల సెంటిమెంట్‌గా ఉండటంతో ఆ డేట్‌ను లాక్ చేశారు. అయితే, ఇప్పుడు అంతకు ఒక్క రోజు ముందే అంటే ఏప్రిల్ 30న రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. ఇలాంటి సిచుయేషలో లెనిన్ వచ్చే పరిస్థితి లేదు. అఖిల్ తన సినిమా కోసం కొత్త విడుదల తేదీని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామ్ చరణ్ పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తున్న ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇంతటి భారీ సినిమా విడుదలైన మరుసటి రోజే ‘లెనిన్’ను రిలీజ్ చేయడం రిస్క్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనివల్ల థియేటర్ల కేటాయింపులో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘లెనిన్’ చిత్రం అఖిల్‌కు అత్యంత కీలకం. అందుకే ‘పెద్ది’ లాంటి భారీ ప్రాజెక్టుతో పోటీ పడకుండా, సేఫ్ డేట్ కోసం మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ‘లెనిన్’ కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
బాలయ్య కోసం గోపించంద్ మలినేని భారీ ప్లానింగ్
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే మాస్ జాతర. ‘వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న NBK111 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఒక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాలని భావించారు. అయితే, ప్రస్తుత మార్కెట్ లెక్కలు మరియు బడ్జెట్ సమీకరణాల దృష్ట్యా, ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే పక్కా “ఫ్యామిలీ ఎమోషన్స్ & పవర్ ఫుల్ యాక్షన్” కథను గోపీచంద్ మలినేని సిద్ధం చేశారు. బాలయ్య మార్కు యాక్షన్ తో పాటు ప్రతి ఒక్కరినీ కదిలించే ఎమోషన్స్ టచ్ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని గత కొద్దిరోజులుగా వైజాగ్‌లో ఉండి ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ‘వన్-లైన్ ఆర్డర్’ ఫైనల్ చేయడంతో కథపై పూర్తి స్పష్టత వచ్చేసింది. ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న దర్శకుడు ఈరోజే హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడ బాలయ్యను కలిసి పూర్తి స్థాయి నెరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బాలయ్య పలు కథలు వైన్ పనిలో ఉన్నారు. ఇటీవల మళయాళ దర్శకుడు హనీఫ్ అదేని, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయా కథలు వినిపించారు. ఇక వీరసింహ రెడ్డితో మెప్పించిన గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.
“చెన్నై వాలా” అంటే ధనుషేనా? రిపోర్టర్ల ప్రశ్నలకు మృణాల్ ఠాకూర్ సిగ్గుల మొగ్గ!
మృణాల్ ఠాకూర్ – ధనుష్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా తన బాలీవుడ్ ‘దో దివానే షెహర్ మే’ మూవీ ప్రమోషనల్ లో బాగంగా విలేకర్లతో ముచ్చటించగా.. మృణాల్‌కు రిపోర్టర్ల నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒక రిపోర్టర్ పరోక్షంగా ధనుష్‌ను ఉద్దేశిస్తూ “చెన్నై వాలా” గురించి అడగడంతో మృణాల్ ఒక్కసారిగా నవ్వేశారు. ఆమె పక్కనే ఉన్న నటుడు సిద్ధాంత్ చతుర్వేది కూడా ఆమెను ఆటపట్టిస్తూ నవ్వడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. నిజానికి ధనుష్ తన తదుపరి చిత్రం ‘D-55’ (రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో) కోసం మృణాల్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని రిపోర్టర్లు ప్రస్తావిస్తూ ఆమెను ఆటపట్టించారు. మృణాల్ దీనికి నేరుగా సమాధానం చెప్పకపోయినా, ఆమె ముఖంలోని చిరునవ్వు చూస్తుంటే ఈ కాంబినేషన్ దాదాపు ఖాయమేనని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “చెన్నై వాలా” అంటూ ధనుష్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ధనుష్ ప్రజంట్ పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తుండటంతో, మృణాల్ వంటి టాలెంటెడ్ నటి ఆయన పక్కన ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.