Shrad Pawar: మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవల కాలంలో నాగ్ పూర్ నగరంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు ఔరంగాబాద్ వంటి తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలో సీఎం కేసీఆర్ హాట్ టాపిక్ అయ్యారు. ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్) పార్టీలు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నాయి.
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ 600 కార్ల వాహన శ్రేణితో షోలాపూర్ వెళ్లారు. దీనిపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం స్పందించారు. కేసీఆర్ భారీ వాహనశ్రేణితో మహారాష్ట్ర పట్టణానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. భారత రాష్ట్ర సమితి విస్తరణ ప్రణాళికలలో భాగంగా మహారాష్ట్రలోని షోలాపూర్ కు వెళ్లారు. సార్కోలి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పండరీపూర్ లోని విఠల్-రుక్మిణి ఆలయాన్ని సందర్శించారు. ఏకంగా 600 కార్లతో ర్యాలీగా వెళ్లడం ఒక్కసారిగా మహారాష్ట్రలోని పలు పార్టీల నాయకుల దృష్టిని ఆకర్షించింది.
కేసీఆర్ వాహనాల సంఖ్య పరంగా పెద్ద బలాన్ని చూపించడం ఆందోళనకరమని అన్నారు. ఆయన రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి దృష్టిసారిస్తే బాగుండేదని శరద్ పవార్ అన్నారు. ఆసక్తికరంగా, సర్కోలి గ్రామంలో కేసీఆర్ నిర్వహించిన కార్యక్రమంలో శరద్ పవార్ పార్టీకి చెందిన ఒక నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఎన్సీపీ నేత భగీరథ్ భేల్కే పార్టీలో చేరారు. ఈయన పండరీపూర్ అసెంబ్లీ స్థానంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న దివంగత భరత్ భేల్కే కుమారుడు. అతని తండ్రి మరణంత తర్వాత ఉపఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థిగా భగీరథ్ పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి సమాధాన్ ఔతాడే చేతిలో ఓడిపోయారు.
మరోవైపు ఎన్సీపీ మిత్రపక్షమైన శివసేన(ఉద్ధవ్) తన సొంత పత్రిక అయిన సామ్నా ద్వారా కేసీఆర్ పై విమర్శలు గుప్పించింది. కేసీఆర్ తెలంగాణ, మహారాష్ట్రలో ఓడిపోతారని విమర్శించింది. మహారాష్ట్రలో రైతుల ఓట్లను అడుగుతూ.. బీజేపీకి సహాయపడేలా కనిపిస్తున్నారంటూ ఆరోపించింది. గతంలో శరద్ పవార్ కూడా బీజేపీ-బీ టీమ్ అంటూ కామెంట్స్ చేశారు.