Encounter underway in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున ప్రారంభం అయిన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో జమ్మూకాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లా వాటర్ హైల్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. లష్కరే తోయిబా/ ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని జమ్మూ కాశ్మీర్ పోలీస్ అధికారి ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.
అత్యంత కీలక ఉగ్రవాది లతీఫ్ రాథర్ ఈ ముగ్గురు ఉగ్రవాదుల్లో ఉన్నాడు. గతంలో కాశ్మీర్ వ్యాప్తంగా జరిగిన హిందూ పండిట్లు, ఇతరుల హత్యలో కీలక నిందితుడిగా ఉన్నాడు లతీఫ్ రాథర్. కాశ్మీరీ పండింట్ రాహుల్ భట్ హత్యలో లతీఫ్ ప్రమేయం ఉంది. మే 12న చదూరా తహసిల్ కార్యాలయంలో ఉద్యోగి రాహుల్ భట్ ను కాల్చిచంపారు. ఈ హత్య కాశ్మీర్ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానికేతరులు, హిందువులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాహుల్ భట్ హత్య అనంతరం కాశ్మీర్ టీవీ నటి అమ్రీన్ భట్ ను కూడా ఉగ్రవాదులు కాల్చిచంపారు.
READ ALSO: Langya henipavirus: చైనాలో కొత్త రకం వైరస్.. 35 కేసులు నమోదు
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ పేరుతో హైబ్రిడ్ టెర్రిరజానికి పాల్పడుతున్నారు. ఈజీ టార్గెట్లు అయిన స్థానికేతరులు, వ్యాపారులు, హిందువులను కాల్చి చంపుతున్నారు. దీంతో ప్రజల్లో అశాంతి కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భద్రతా బలగాలు ఈ విధంగా దాడులు చేస్తున్న వారిని వెతికిపట్టుకుని మరీ ఎన్ కౌంటర్లలో లేపేస్తోంది.