ISIS Planning Terror Attack On August 15: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇండిపెండెంట్ డే వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ కుట్ర చేసింది. అయితే ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీలో సభ్యుడిగా ఉన్న సబావుద్దీన్ అజ్మీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తుండటాన్ని గుర్తించిన యూపీ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ సబావుద్దీన్ అజ్మీని లక్నో హెడ్ క్వార్టర్స్ లో విచారించిన తరువాత అదుపులోకి తీసుకుందని లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. యూపీ ఆజంగఢ్ జిల్లా ఆమీలో ప్రాంతానికి చెందిన సబావుద్దీన్ కు దిలావర్ ఖాన్, బైరామ్ కాన్ అనే పేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి ఐఎస్ఐఎస్ రిక్రూటర్లలో నేరుగా పరిచయాలు ఉన్నాయి. దీంతో అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులను పెట్టారు పోలీసులు. నిందితుడు అజ్మీ దగ్గర నుంచి బాంబుల తయారీకి ఉపయోగించే పదార్ధాలు, అక్రమ ఆయుధాలు, కాట్రిడ్జ్ స్వాధీనం చేసుకుంది ఏటీఎస్.
Read Also: Bihar: నేడు నితీష్ ప్రమాణ స్వీకారం.. మరోవైపు బీజేపీ ఆందోళన
ఉగ్రవాది సబావుద్దీన్ అజ్మీ ఐసిస్ భావజాలానికి ప్రభావితం అయి.. మరి కొంత మందిని ఐసిస్ లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఫేస్ బుక్ లో బిలాల్ అనే వ్యక్తితో తరుచుగా మాట్లాడుతూ.. కాశ్మీర్ లోని పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిలాల్, పట్టుబడ్డ అజ్మీకి ఐఎస్ఐఎస్ సభ్యుడు మూసా అలియాస్ ఖత్తాబ్ కాశ్మీరిని పరిచయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డ ఉగ్రవాది మూసాతో పాటు సిరియాలోని అబు బకర్ అల్ షామీతో టచ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసానికి పాల్పడటంతో పాటు ఆర్ఎస్ఎస్ సభ్యులను టార్గెట్ చేసుకుని హతమార్చాలనే కుట్ర పన్నుతున్నాడని పోలీసులు వెల్లడించారు.