India to receive 3rd squadron of S-400 air defence missile system: ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్నా, ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా.. భారత్, రష్యాల మధ్య బంధం బలంగానే ఉంది. స్వాతంత్య్రం అనంతరం నుంచి భారత రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా రష్యా మీదే ఆధారపడుతోంది. చాలా సందర్భాల్లో వెస్ట్రన్ దేశాలు భారత్ కు మద్దతు తెలపకున్నా.. రష్యా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే భారత రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన క్షిపణి నిరోధక వ్యవస్థ ఎస్-400ను రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది.
రూ.35,000 కోట్లతో మూడేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఎస్-400 కోసం ఒప్పందం జరిగింది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో రష్యా ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ యొక్క మూడవ స్క్వాడ్రన్‌తో భారతదేశానికి సరఫరా చేయడం ప్రారంభించనుంది. ఈ పరికరాల కోసం ఇప్పటికే వైమానిక దళ సిబ్బందితో సహా భారత బృందాలు రష్యాలో ఉన్నాయి. వచ్చే ఏడాది మొదట్లో మూడవ స్క్వాడ్రన్ భారత్ కు అందనుందని రక్షణ దళాలు వెల్లడించాయి.
Read Also: Uttar Pradesh: శ్రద్ధావాకర్ తరహా కేసు.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య
ఇప్పటికే భారత్ తన రెండు క్షిపణి వ్యవస్థ స్వ్కాడ్రన్లను రష్యా నుంచి పొందింది. మొదటి ఎస్-400 స్వ్కాడ్రన్ ను లడఖ్ సెక్టార్ లో, రెండవదాన్ని పశ్చిమ బెంగాల్ ను ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ సిలిగురి కారిడార్ వద్ద మోహరించింది. శత్రు దేశాల యుద్ధవిమానాలు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ఎస్-400 క్షిపణి వ్యవస్థ తన మిస్సైళ్లతో వాటిని కూల్చేస్తుంది. మొత్తం 5 ఎస్-400 స్వ్కాడ్రన్లను భారత్, రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. వచ్చే ఏడాది వరకు అన్నీ కూడా భారత్ చేరే అవకాశం ఉంది.
భారత్ వద్ద ఇప్పటికే ఎంఆర్-సామ్, ఆకాష్ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ఇజ్రాయిలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను కలిగి ఉంది. ప్రస్తుతం రానున్న ఎస్-400తో భారత రక్షణ వ్యవస్థ మరింతగా బలపడుతుంది. చైనా సరిహద్దులను మొత్తం ఈ ఎస్-400 క్షిపణి రక్షక వ్యవస్థతో కవర్ చేయవచ్చు. ఇక రష్యాతో కలిసి జాయింట్ గా అమెథీలో ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రష్యా నుంచి కొన్ని యంత్రాలు యూపీలోని అమేథీకి చేరుకున్నాయి. రష్యాతో పాటు అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ నుంచి భారత్ భారీగా ఆయుధాలను కొంటోంది. అయితే ఇప్పటికీ భారత్ ఆయుధాల్లో 50 శాతం వరకు రష్యాకు చెందినవే ఉన్నాయి.