Manipur Violence: మణిపూర్‌పై ఐక్యరాజ్యసమితి(యూఎన్) నిపుణులు చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పపట్టింది. అనవసరమైన, ఊహాజనిత, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలుగా అభివర్ణించింది. మణిపూర్ లో పరిస్థితి శాంతియుతంగా ఉందని పేర్కొంది. శాంతిభద్రతలకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఐక్యరాజ్యసమితితో భారత మిషన్ స్పష్టం చేసింది. మణిపూర్ ప్రజలతో సహా భారతదేశ ప్రజల మానవ హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. మణిపూర్ పరిస్థితులను భారత్ ప్రభుత్వం చక్కదిద్దడానికి తీసుకున్న చర్యలపై పూర్తి అవగాహన లేకుండా యూఎన్ వ్యాఖ్యలు చేస్తోందని యూఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు.. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు ఎంతంటే..!
మణిపూర్ లో లైంగిక హింస, చట్టవిరుద్ధమైన హత్యలు, గృహ విధ్వంసం, ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లేలా చేయడం, హింసించడం వంటి చర్యలతో పాటు మణిపూర్ లో తీవ్రమైన మానవహక్కల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం ఓ నివేదికను ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా భారత్ తీవ్రంగా స్పందించింది. స్పెషల్ ప్రొసీజర్ మాన్‌డేట్ హోల్డర్( SPMH) విడుదల చేసిన ఈ నివేదికపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం ప్రతిస్పందన తెలుసుకోకుండా ఏకపక్షంగా ఈ వివరాలనున ప్రెస్ రిలీజ్ చేయడాన్ని తప్పుపట్టింది. వాస్తవాల ఆధారంగా భవిష్యత్తులో SPMH అంచనాలు ఉంటాయని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. సంబంధం లేని పరిణామాలపై వ్యాఖ్యానించడం మానుకోవాలని వార్తా ప్రకటనను జారీ చేయడానికి ఏర్పాటు చేయడానికి విధానానికి కట్టుబడాలని, భారత ప్రభుత్వం నుంచి తగిన సమాచారం వచ్చే వరకు వేచి ఉండాలని సూచించింది.
గత నాలుగు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య సంఘర్షణ జరుగుతోంది. మెజారిటీ మైయిటీ, మైనారిటీ కుకీ తెగల మధ్య వివాదం జరుగుతోంది. రాష్ట్రంలో 10 శాతం భూభాగంలో మెజారిటీ మైయిటీలు పరిమితం కావడం, మిగిలిన 90 శాతం భూభాగంలో మైనారిటీలు ఉండటం, తమకు కూడా ఎస్టీ హోదా కల్పించాలని మైయిటీలు డిమాండ్ చేయడంతో ఆ రాష్ట్రం అగ్ని గుండంగా మారింది. వందల్లో ప్రజలు చనిపోయారు. ప్రస్తుతం అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయి.