India Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎక్కువ చేసింది. మైనారిటీలు ముఖ్యంగా హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యాపారాలను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నా యూనస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పలు సందర్భాల్లో మైనారిటీలపై దాడుల గురించి ఇండియా ఎన్నిసార్లు చెప్పినా లెక్క చేయడం లేదు.
దీంతో, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. బంగ్లాదేశ్ నుంచి దుస్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కొన్ని వారాల తర్వాత, భారత్ మరోసారి బంగ్లాదేశ్‌ని భారీ దెబ్బ కొట్టింది. ఆ దేశం నుంచి వచ్చే జనపనార దిగుమతులను పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ముంబైలోని నవా షెవా ఓడరేవు తప్ప, బంగ్లాదేశ్ నుండి వచ్చే జనపనారను ఏ భూ లేదా సముద్ర ఓడరేవుల ద్వారా భారతదేశంలోకి అనుమతించబోమని పేర్కొంది. అధికార వర్గాల ప్రకారం, జనపనార, ఇతర బంగ్లాదేశ్ ఫైబర్ ఉత్పత్తులపై నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని చెప్పింది.
దీనికి ముందు మే 17న, భారత్ తన ల్యాండ్ పోర్టుల ద్వారా బంగ్లాదేశ్ దుస్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. దుస్తులతో పాటు బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య భారతదేశానికి ఇతర ఉత్పత్తులు కూడా ల్యాండ్ పోర్టుల ద్వారా నిలిపివేయబడ్డాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి వచ్చే జనపనారపై సుంకాలు లేకపోవడంతో గత కొంత కాలంగా దేశంలోని జనపనార పరిశ్రమ నష్టపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయం దేశంలో జనపనార పరిశ్రమకు ఊతం ఇచ్చేలా ఉంది. మిల్లులు, రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఫ్లాక్స్ టో మరియు వ్యర్థాలు (నూలు వ్యర్థాలు, గార్నెటెడ్ స్టాక్‌తో సహా), జ్యూట్, ఇతర టెక్స్‌టైల్ బాస్ట్ ఫైబర్‌లు, జ్యూట్ లేదా ఇతర టెక్స్‌టైల్ బాస్ట్ ఫైబర్‌ల సింగిల్ నూలు, నేసిన బట్టలు లేదా ఫ్లాక్స్, జనపనార లేదా ఇతర టెక్స్‌టైల్ బాస్ట్ ఫైబర్‌ల బ్లీచ్ చేయని నేసిన బట్టలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, మేఘాలయ వంటి భారతీయ రాష్ట్రాలు జనపనారను ఉత్పత్తి చేస్తాయి. జనపనార పరిశ్రమ మిల్లులు,ఇతర చిన్న యూనిట్లు సుమారు నాలుగు లక్షల మంది కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.