Modiji: పాకిస్తాన్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడుతూ.. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత సైన్యం వారిని దెబ్బతీసిందని అన్నారు. ఇక, పౌరులు, పార్టీలు అన్నీ ఏకతాటి పైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశాయని పేర్కొన్నారు. భారతీయ మహిళల నుదిటిపై సింధూరం తుడి చేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాగే చెప్పామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు చేశాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: PM Modi: సింధూరం తొలగిస్తే ఏమవుతుందో పాకిస్తాన్కి చూపించాం..
ఇక, ఉగ్రవాదులకు ప్రధాన స్థావరాలైన బహావల్‌పుర్, మురుద్కేపై భారత సైన్యం మెరుపు దాడి చేసి బీభత్సం సృష్టించింది అని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు భారత్ ఏం చేస్తుందో క్లియర్ గా చెప్పింది అన్నారు. పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే డ్రోన్లు, మిసైల్లను పూర్తిగా ధ్వంసం చేశాం.. పాక్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని తీసుకొచ్చామని తెలిపారు. భారత్ చర్యలకు బెంబేలేత్తిపోయిన పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని వెల్లడించారు. ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాక్ డీజీఎంవో కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు.