Needle Stuck In Hip: అత్యంత అరుదైన కేసులో ఒక మహిళ తుంటి భాగంలో సూది 3 ఏళ్లుగా ఉంది. దీనిని తొలగించడానికి డాక్టర్లు సర్జరీ చేయాల్సి వచ్చింది. ఢిల్లీకి చెందిన 49 ఏళ్ల రంభాదేవీ అనే మహిళ తుంటి కండరాల్లో మూడేళ్లుగా సూది ఉండిపోయింది. కుట్టుపని చేస్తుండగా అనుకోకుండా సూది ఆమె కండరాల్లోకి చొచ్చుకెళ్లింది. కుట్టుపని చేస్తుండగా, సూది మంచంపై పెట్టి ఉంచింది. ఆమె వేరే పనికి వెళ్లి వచ్చి, సూది అక్కడ ఉంచిన విషయాన్ని మరిచిపోయి దానిపై కూర్చుంది. ఆ సమయంలో ఆమెకు తీవ్రంగా నొప్పి వచ్చింది, చూసే సరికి మంచంపై సగం విరిగిన సూది కనిపించింది, మిగిలిన సగం అక్కడే ఎక్కడో పడి ఉంటుందని భావించింది.
Read Also: Turbulence: ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు..
అయితే, ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆమె తుండి భాగం అసౌకర్యంగా అనిపించడం ప్రారంభమైంది. కాలక్రమేణా దాని తీవ్రత పెరుగుతూ వచ్చింది. నొప్పి భరించలేక వైద్యుడిని సంప్రదించాలని నిర్ణయించుకుంది. ఎక్స్-రే తీయగా తుంటి భాగంలో సూది ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ సూదిని వెలికితీసే సర్జరీ కోసం ప్రత్యేకంగా సీ-ఆర్మ్ అనే పరికరాన్ని ఉపయోగించారు. అయితే, సర్జరీ సమయంలో సూదిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. దీంతో చాలా ఎక్స్-రే ఇమేజెస్ ఆధారంగా సూది ఉన్న భాగాన్ని ఖచ్చితంగా కనుగొని, దానిని వెలికితీశారు. ఇది చాలా సంక్లిష్టమైందిగా ఆస్పత్రి జనరల్ సర్జరీ విభాగంలో సీనియర్ డాక్టర్ తరుణ్ మిట్టల్ చెప్పారు.