Amit Shah: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి, వారితో సఖ్యతగా వ్యవహరించాలి, పీఓకేని అడగొద్దని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు మిగతా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అయ్యర్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. కౌశాంబి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మణిశంకర్ అయ్యార్, ఫరూఖ్ అబ్దు్ల్లాలు అణుబాంబు ఉన్నందున పాకిస్తాన్‌ని గౌరవించాలని, పాక్ ఆక్రమిక కాశ్మీర్ అడగొద్దని చెప్పారు. రాహుల్ బాబా మీరు అణుబాంబుకు భయపడుతున్నారు, మేం భయపడటం లేదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌కి చెందినది, దాన్ని మేం తిరిగి పొందుతాం’’ అన్నారు.
Read Also: Polling Centers: వేములవాడలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..
మణిశంకర్ అయ్యర్ వైరల్ వీడియోలో మాట్లాడుతూ..పాకిస్తాన్ సార్వభౌమాధికార దేశం, భారత్ దానికి గౌరవం ఇవ్వాలి, వారి వద్ద అణు బాంబులు ఉన్నాయని చెప్పారు. ఎవరైనా పిచ్చివాడు లాహోర్‌పై బాంబు వేస్తే దాని ప్రభావం అమృత్ సర్‌పై ఉంటుందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ దూరంగా ఉంది, తమకు అయ్యర్ తో సంబంధం లేదని చెప్పింది. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, పీఓకేని భారత్ స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు కాశ్మీరీ నేత ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ గాజులు తొడుక్కొని లేదని, వారి వద్ద అణుబాంబులు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా దుమారం రేగింది.