Adhir Ranjan: కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ పీసీసీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మరోసారి తృణమూల్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను బయట నుంచి మద్దతు ఇస్తానని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ నేను ఆమెను నమ్మను, ఆమె కూటమిని విడిచిపెట్టింది. బీజేపీ వైపు వెళ్లవచ్చు’’ అని అన్నారు. ఆమె కూటమి బయట, లోపల ఏం చేస్తుందో నాకు తెలియదని అన్నారు.
Read Also: Isro: శక్తివంతమైన “సౌర తుఫాను” నుంచి ఇస్రో మన శాటిలైట్లను ఎలా రక్షించింది..?
గతంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్‌లో కాంగ్రెస్-టీఎంసీ పోటీకి అధిర్ రంజన్ అడ్డుపడ్డాడని వ్యాఖ్యానించి, సొంతగా పోటీ చేసింది. అధిర్ రంజన్-మమతా మధ్య గత కొన్ని రోజులుగా వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి తాజా వ్యాఖ్యలు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 70 శాతం స్థానాలకు పోలింగ్ ముగిసిన తర్వాత, ఆమె నుంచి యూటర్న్ వచ్చిందని అన్నారు. గతంలో కాంగ్రెస్‌కి 40 సీట్లు రావని మమతా బెనర్జీ చెప్పారని, కాంగ్రెస్ నాశనం గురించి మాట్లాడారని, ఇప్పుడు కాంగ్రెస్, ఇండియా కూటమికి అనుకూలంగా మాట్లాడటం బట్టి చూస్తే కూటమి అధికారంలోకి వస్తుందని తెలుస్తోందని అధిర్ అన్నారు.
మమతా బెనర్జీ కాంగ్రెస్, సీపీఎంలను మిత్ర పక్షాలుగా చూడలేదని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్-సీపీఎం పార్టీలు బెంగాల్‌లో పొత్తు పెట్టుకుని, టీఎంసీకి, బీజేపీకి వ్యతిరేకంగా తన అభ్యర్థులను నిలిపాయి. బెంగాల్‌లో మొత్తం 42 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 గెలుచుకుంటే, బీజేపీ 18 సీట్లను సాధించింది, కాంగ్రెస్ 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.