Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ పై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలను మరింత రెట్టింపు చేవారు. గౌరవ్ గొగోయ్ కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న హిమంత, ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీకి పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ నుంచి ఆహ్వానం అందిందని, అందుకే పొరుగు దేశం వెళ్లారని ఆరోపించారు. గొగోయ్ ట్రైనింగ్ పొందడానికి పాకిస్తాన్ వెళ్లారని, ఇది తీవ్రమైన విషయమని శర్మ ఆరోపించారు.
‘‘గౌరవ్ గొగోయ్ ఐఎస్ఐ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ కు వెళ్ళాడు. మొదటిసారిగా, ఐఎస్ఐ ఆహ్వానం మేరకు ఆయన పాకిస్తాన్ కు వెళ్ళారని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ పత్రం మా దగ్గర ఉంది. శిక్షణ పొందడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. పాకిస్తాన్ హోం శాఖ నుండి లేఖ అందిన తర్వాత గౌరవ్ గొగోయ్ అక్కడికి వెళ్ళాడు. ఇది చాలా తీవ్రమైన విషయం. దీని తర్వాత, మరింత గణనీయమైన చర్యలు తీసుకోబడతాయి’’ అన్నారు.
Read Also: Fire Accident: ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి.. సీఐపై బంధువుల దాడి..
పాకిస్తాన్ ఉగ్రవాదం తీరును ఎండగట్టడానికి భారత దౌత్యబృందం జాబితా నుంచి గొగోయ్ పేరు తొలగించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కోరిన ఒక రోజు తర్వాత అస్సాం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. గొగోయ్ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్‌కి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని శర్మ ఆరోపించారు. గొగోయ్ భార్యకు పాకిస్తాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ పాకిస్తాన్ సానుభూతిపరుడు అని చెప్పారు.
గొగోయ్ భారత అధికారులకు సమాచారం ఇవ్వకుండా 15 రోజులు పాకిస్తాన్‌లో ఉన్నారని, ఆయన భార్య భారతదేశంలో పనిచేస్తూ పాకిస్తాన్‌కి చెందిన ఎన్జీవో నుంచి జీతం తీసుకుంటుందని హిమంత ఆరోపించారు. ఆయనపై ఉన్న ఆరోపణలకు సంబంధించి సెప్టెంబర్ 10 నాటికి వెల్లడిస్తానని చెప్పారు. అయితే, గొగోయ్ తన భార్యపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. తనపై ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను నిజంగా జాతీయ భద్రతకు ముప్పు కలిగి ఉంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని గొగోయ్ ప్రశ్నించారు.