Cheque Spelling Errors: హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాకు చెందిన ఒక ఆర్ట్ టీచర్‌ను సస్పెండ్ చేశారు. ఆయన సంతకం చేసిన చెక్కుపై అక్షర దోషాలు (స్పెల్లింగ్ మిస్టేక్స్) తీవ్రంగా ఉండటంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ ఈ తప్పులను తీవ్రమైనవి, ఆమోదయోగ్యం కానివిగా పేర్కొంటూ వివరణ కోరింది. అయితే, రోన్‌హత్‌లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో పని చేస్తున్న ఆ టీచర్‌ను అత్తర్ సింగ్ గా గుర్తించారు. ఆయనకు ప్రిన్సిపాల్ జారీ చేసిన రూ. 7,616 (రూపాయలు ఏడు వేల ఆరు వందల పదహారు) చెక్కుపై సంతకం చేశారు. ఆ చెక్‌పై సంఖ్యా విలువ సరిగ్గా రాసినప్పటికీ, అక్షరాలలో ఆయన ఇలా రాసుకొచ్చారు.. “Saven Thursday six Harendra sixty rupees” .. ఇది అర్థం కాకపోవడంతో బ్యాంకు ఆ చెక్కును తిరస్కరించింది.. ఈ విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ తక్షణమే చర్యలు తీసుకుంది.
Read Also: Vijay Sethupathi : పూరి–విజయ్ సేతుపతి ప్రాజెక్ట్‌కి.. మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
అయితే, జిల్లా విద్యాధికారి రాజీవ్ డోగ్రా మాట్లాడుతూ.. అక్షర దోషాలపై తాము పూర్తి చర్యలు తీసుకుంటాం.. టీచర్‌ను తక్షణమే సస్పెండ్ చేసి వివరణ కోరడం జరిగింది.. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించాం, సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే టీచర్‌కు పంపినట్లు తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన అంశం బయటపడింది. టీచర్‌కు జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్‌లోనే పలు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్లు తేలింది. వాటిలో “Sirmour”, “Educatition”, “Princpal” లాంటి తప్పులు ఉన్నాయి. కాగా, విద్యాశాఖ డైరెక్టర్ రాజీవ్ ఠాకూర్ కూడా సస్పెన్షన్ డాక్యుమెంటేషన్‌లోని ఈ తప్పులను అంగీకరించారు. “టీచర్‌కు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులలో ఉన్నవి క్లరికల్ తప్పులు, వీటిని సరిచేయవచ్చు.. కానీ, ఆయన చెక్కుపై చేసిన తప్పును సరిదిద్దలేం.. అతడు ఆ పదాల నిర్మాణాన్నే పూర్తిగా మార్చేశారని మండిపడ్డారు.