Sabarimala: కేరళలో నిపా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆరుగురికి నిపా వైరస్ సోకగా.. ఇద్దరు మరణించారు. మరో నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిపా నేపథ్యంలో శబరిమల యాత్రికులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శబరిమల యాత్ర కోసం అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ కార్యదర్శితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ట్రావెన్‌కోర్ దేవస్వ బోర్డును కోర్టు కోరింది.
Read Also: INDIA Bloc: ఇండియా కూటమి భోపాల్ ర్యాలీ రద్దు.. అందుకే రద్దు చేసుకుందన్న బీజేపీ
ప్రతీ మలయాళ నెలలో పూజల కోసం పాతానంతిట్ట జిల్లాలోని శబరిమల ఆలయం 5 రోజుల పాటు తెరుచుకుంటుంది. ఈ నెల ఆదివారం నుంచి యాత్రికుల కోసం దేవాలయం తెరుచుకుంటుంది. మరోవైపు నిపా వైరస్ కేసులతో కేరళ ప్రభుత్వం హై అలర్ట్ గా ఉంది. ఇప్పటికే కోజికోడ్ జిల్లాలో ఆరుగురికి వైరస్ సోకింది. దీంతో హైకోర్టు యాత్రికుల రక్షణ కోసం మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. కోజికోడ్ జిల్లాలో ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
కోజికోడ్ జిల్లాలో ఇప్పటికే పలు పంచాయతీల్లో లాక్ డౌన్ విధించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకి వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తాజాగా కేరళలో బయటపడుతున్న నిపా వైరస్ ‘బంగ్లాదేశ్ వేరియంట్’ అని దీని వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ, మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణాజార్జ్ తెలిపారు. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే వారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ అటవీ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి.