Sharad Pawar: రైతుల కష్టాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ, ఎన్సీపీ నేత శరద్ పవార్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత శరద్ పవార్ ప్రధాని మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2004-2014 మధ్య కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీకి సాయం చేశానని అన్నారు. ఆ సమయంలో అతని రాష్ట్రంలో వ్యవసాయం చాలా సంక్షోభంలో ఉందని అన్నారు. ఒకానొక సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి తనకు ఫోన్ చేసి ఇజ్రాయిల్‌లో విశిష్టమైన వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు అక్కడికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడని శరద్ పవార్ అన్నారు.
వ్యవసాయ రంగంలోని సమస్యలపై తన వద్దకు వచ్చే వాడని, నన్ను గుజరాత్ తీసుకెళ్లారని, ఒకసారి ఇజ్రాయిల్‌ని సందర్శించాలని అనుకున్నప్పుడు తనను నా వెంట తీసుకెళ్లానని, ఇప్పుడు నరేంద్రమోడీ ఏం చెప్పినా తాను పట్టించుకోనని శరద్ పవార్ అన్నారు. అంతకుముందు ప్రధాని మాట్లాడుతూ.. రైతుల కోసం శరద్ పవార్ ఏం చేయలేదని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హయాంలో రైతులు భారీగా లబ్ధి పొందారని, శరద్ పవార్ రైతాంగాన్ని విడిచిపెట్టారని, వారి సంక్షేమం కోసం ఆయన ఏం చేయలేదని మోడీ విమర్శలు గుప్పించారు. జూలై 2017లో ఇజ్రాయిల్‌ని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్ర సృష్టించారు.