కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేసింది.. ఇక, మహారాష్ట్రలో చెప్పాల్సిన పనేలేదు.. అందులో ముంబై ఎదురైన అనుభవం మామూలుదికాదు.. అయితే, ఇప్పుడిప్పుడే కరోనా నుండి తేరుకుంటున్న ముంబై ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులగా కురిసిన వర్షాలతో ముంబై మొత్తం జలమయమైంది. ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచనలు సైతం చేశారు. ఈ క్రమంలో ముంబై వాసులకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగురోజుల పాటు ముంబైలో భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముంబై నగరంతోపాటు శివారు ప్రాంతాలు, థానే, పాల్ఘార్, రాయ్ గడ్ జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరమంతా జలమయమైంది. వరదలతో రైళ్లను సైతం రద్దుచేశారు. భారీవర్షాలతో పలు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబై పోలీసులు సూచించారు.