Chandipura virus: గుజరాత్ రాష్ట్రాన్ని కొత్త వైరస్ కలవరపెడుతోంది. ‘చండీపురా వైరస్’గా పిలిచే ఇన్ఫెక్షన్ల కారణంగా ఇప్పటికే నలుగురు పిల్లలు మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. మరో ఇద్దరు పిల్లలు ఈ అనుమానిత వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారని శనివారం అధికారులు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులకి సబర్‌కాంత జిల్లాలోని హిమత్ నగర్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్‌ని 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో కనుగొన్నారు. దీని వ్యాప్తి వల్ల గ్రామంలో చాలా మంది జ్వరం, మెదడువాపుతో బాధపడ్డారు. దీంతో ఈ గ్రామం పేరుతోనే వైరస్‌ని వ్యవహరిస్తున్నారు.
Read Also: Siddharth 40: సిద్ధార్థ్ మూవీతో కంబ్యాక్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
చండీపురా వైరస్ జ్వరాన్ని కలిగిస్తుంది. ఫ్లూ వంటి లక్షణాలను, తీవ్రమైన మెదడువాపు లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వ్యాధిని కలిగించే వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన ‘వెసిక్యులో వైరస్’ జాతికి చెందినది. ఇది దోమలు, పేలు, ఈగలు వంటి వాహకాల ద్వారా వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఆరుగురి పిల్లల రక్త నమూనాలను వైరస్ నిర్ధారణ కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపామని, వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని సబర్‌కాంత జిల్లా వైద్యాధికారి వెల్లడించారు.
హిమ్మత్‌నగర్ సివిల్ ఆసుపత్రిలో జులై 10న నలుగురు చిన్నారులు చనిపోవడంతో చండీపురా వైరస్ కారణం కావచ్చనే అనుమానాన్ని వైద్యులు వ్యక్తి చేశారు. ఆస్పత్రిలో చేరిన మరో ఇద్దరు చిన్నారుల్లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపించాయి. ఇప్పటి వరకు మరణించిన నలుగురు చిన్నారుల్లో ఒకరు సబర్‌కాంత జిల్లాకు చెందిన వారు కాగా, ఇద్దరు పొరుగున ఉన్న ఆరావళి జిల్లాకు చెందిన వారు, నాలుగో పిల్లాడు రాజస్థాన్‌కి చెందినవాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు కూడా రాజస్థాన్‌కి చెందిన వారే. ఇన్ఫెక్షన్‌ను అరికట్టడానికి, ప్రభావిత ప్రాంతాల్లో ఇసుక ఈగలను నివారించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.