India: ఇజ్రాయిల్-హమాస్ పోరు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయులకు మంగళవారం కీలక సూచనలను జారీ చేసింది. క్షిపణి దాడిలో భారతీయులు మరణించిన తర్వాత, ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘‘ ప్రస్తుతం భద్రతా పరిస్థితులు, స్థానిక భద్రతా సలహాల దృష్ట్యా దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, సందర్శించే వారు ఇజ్రాయిల్ లోని సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలని సూచించారు. రాయబార కార్యాలయం వారితో టచ్‌లో ఉంది. ఇజ్రాయిల్ అధికారులు మా పౌరులందరికీ భద్రత కల్పించాలి’’ అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా పేర్కొంది.
పోస్టులో ఎంబసీ సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్ షేర్ చేసింది. ఎంబసీ తన పోస్ట్‌లో ఇజ్రాయెల్ జనాభా మరియు ఇమ్మిగ్రేషన్ అథారిటీ యొక్క హాట్‌లైన్ నంబర్‌ను కూడా షేర్ చేసింది. క్షిపణి దాడిలో భారతీయులు మరణించిన తర్వాత ఇండియా ఈ సూచనలను జారీ చేసింది. లెబనాన్ నుంచి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ మిస్సైల్ ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దు ప్రాంతాన్ని తాకింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. ముగ్గురు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వారు.

Read Also: Haiti: ఎవరీ జిమ్మి చెరిజియర్.. గ్యాంగ్‌స్టర్‌కి వణుకుతున్న హైతీ దేశం..
చనిపోయిన వ్యక్తిని కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన 31 ఏళ్ల పాట్ నిబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. మాక్స్‌వెల్ రెండు నెలల క్రితమే ఇజ్రాయెల్‌కు వచ్చి, అక్కడి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నట్లు సమాచారం. గాయపడిన ఇద్దరు భారతీయులను బుష్ జోసెఫ్ జార్జ్ మరియు పాల్ మెల్విన్‌లుగా గుర్తించారు.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై దాడి చేసి, 1200 మందిని చంపడంతో పాటు 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్, వెస్ట్ బ్యాంకులపై దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు లెబనాన్ లోని హిజ్బుల్లా గ్రూప్ హమాస్‌కి మద్దతుగా ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు గాజా యుద్ధంలో 30,000 మందికి పైగా మరణించినట్లు గాజాలోని ఆరోగ్య అధికారులు తెలిపారు.