Supreme Court: సరోగసీ ద్వారా పిల్లలు కనేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. 44 ఏళ్ల అవివాహిత మహిళ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. పాశ్చాత్య దేశాల వలే వివాహం కాకుండా పిల్లలు కనడంలా కాకుండా, వివాహ పవిత్రతను కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ తన లాయర్ ద్వారా సుప్రీంకోర్టులో సరోగసీ ద్వారా తల్లికావడానికి అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు బివి నాగరత్న, అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై జస్టిన్ నాగరత్న మాట్లాడుతూ.. వివాహ వ్యవస్థలో తల్లిగా మారడం ఇక్కడ ఆచారం, వివాహ వ్యవస్థకు బయట తల్లిగా ఉండటం ప్రమాణం కాదని, మేము దీనిపై ఆందోళన చెందుతున్నామని, దేశంలో వివాహ వ్యవస్థ మనుగడ సాగించాలా..వద్దా..? మనం పాశ్చాత్య దేశాల్లా కాదని, వివాహ వ్యవస్థను రక్షించుకోవాలని, మీరు మమ్మల్ని సంప్రదాయవాదిగా చెప్పవచ్చు, మేము దానిని అంగీకరిస్తామని ఆమె అన్నారు.
Read Also: Esha Deol: సూర్య హీరోయిన్ విడాకులు.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తి
బిడ్డను కనేందుకు వివాహం చేసుకోవాలి లేదా దత్తత తీసుకోవాలని కోర్టు సూచించింది. అయితే, మహిళకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, దత్తత కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సి వస్తోందని మహిళ తరుపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. దీనిపై కోర్టు.. మీరు జీవితంలో అన్నీ కలిగి ఉండలేరు, మీ క్లయింట్ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అని కోర్టు చెప్పింది. చాలా మంది పిల్లలకు తమ తల్లిదండ్రులు తెలియకుండా ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదని కోర్టు పేర్కొంది.
సరోగసి(నియంత్రణ) చట్టంలోని సెక్షన్ 2ని సదరు మహిళ సవాల్ చేసింది. భారతదేశంలో పెళ్లికాని స్త్రీలు సరోగసీని ఎంచుకోకుండా ఈ సెక్షన్ నిరోధిస్తుంది. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం.. 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వితంతువులు లేదా విడాకులు తీసుకున్న మహిళలు మాత్రమే సరోగసీని ఎంచుకోవచ్చు.