ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించడం కష్టమే. చదువున్నా లేకపోయినా ఇంటర్నెట్ మాత్రం కావాలి. లేదంటే ప్రపంచం ముందుకు కదలని పరిస్థితి. ఒకప్పుడు ఇంటర్నెట్ అత్యంత ఖరీదైన వ్యవహారం. కానీ, ఇప్పుడు అదే ఇంటర్నెట్ అత్యంత చౌకగా దొరుకుతున్నది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఫ్రీ వైఫై అందిస్తున్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో ఫ్రీ వైఫై అందిస్తుంటారు. కేవలం రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వైఫై అందించేందుకు యూపీ సర్కార్ సిద్ధం అవుతున్నది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ వైఫై అందుబాటులోకి రాబోతున్నది. రాష్ట్రంలోని 75 జిల్లాల హెడ్ క్వార్టర్స్, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పోరేషన్లు మొత్తం 217 చోట్ల వైఫైను అందించేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నది. దీనికి సంబందించిన బ్లూప్రింట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.