వరుస వరదలతో ఉత్తరాఖండ్ విలవిలలాడుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అక్కడి జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.
రాష్ట్రంలోని నైనితాల్ నదీ ఉగ్రరూపం కారణంగా 30 మంది మరణించారు. చంపావత్ నదీ ప్రవాహం వల్ల నలుగురు, పౌడీ నదీ వరదలతో ముగ్గురు మరణించారు. అల్మోడా నదీ వరదలతో ఐదుగురు, పిథోర్గఢ్ వరదలతో ఒకరు, బాగేశ్వర్ నది వల్ల ఒకరు మొత్తం 44 మరణించారు.
రాష్ట్రంలో తాజా పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఆరాతీశారు. ఉత్తరాఖండ్ వర్షాల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేశారు. ఉత్తరాఖండ్లో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎంతో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా వుందన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.