Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టుపై అమెరికా స్పందించింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను అమెరికా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం జైలులో ఉన్న ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నాయకుడికి ‘‘న్యాయమైన, పారదర్శక, సమయానుకూల న్యాయప్రక్రియ’’ ఉండేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు.
Read Also: Microsoft: మైక్రోసాఫ్ట్ విండోస్‌కు కొత్త బాస్.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర భారతీయ పౌరుల మాదిరిగానే కేజ్రీవాల్‌కి కూడా న్యాయమైన, నిష్పాక్షిక విచారణకు అర్హులని ఇటీవల జర్మనీ విదేశాంగ కార్యాలయం చెప్పిన కొద్ది రోజుల తర్వాత అమెరికా కూడా కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించింది. ‘‘న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్ర్యం మరియు ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని మేము భావిస్తున్నాము మరియు ఆశిస్తున్నాము’’ అని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి శుక్రవారం చెప్పారు.
అయితే, జర్మనీ వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది. భారత ప్రభుత్వం జర్మన్ రాయబారిని పిలిపించింది, భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని తీవ్రంగా చెప్పింది. ప్రస్తుతం అమెరికా విషయంలో కూడా భారత్ ఇదే వైఖరి అవలంభించే అవకాశం ఉంది.