ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్‌కు ప్రమోషన్ లభించబోతుంది. త్వరలో ఆయన రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. ఈ మేరకు డీఎంకే.. కమల్ హాసన్‌కు సందేశం పంపించింది. బుధవారం కమల్ హాసన్‌తో డీఎంకే మంత్రి శేఖర్ బాబు కలిశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ పంపించిన సందేశాన్ని కమల్ హాసన్‌కు తెలియజేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పొత్తు పెట్టుకుంది. పార్టీ అధినేతగా కమల్ హాసన్ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూర్‌లో బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ స్టాలిన్ సూచనలతో విరమించుకున్నారు. అయితే జూలైలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఒప్పందంలో భాగంగా ఒక సీటు కమల్ హాసన్‌కు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని బుధవారం మంత్రి శేఖర్ బాబు.. కమల్ హాసన్‌కు తెలియజేశారు. మొత్తానికి 2025, జూలైలో కమల్ హాసన్ పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు.