పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై మండిపడ్డారు. ‘భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన ఎప్పుడూ జరగలేదు. వారు చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. పార్లమెంట్ పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారు. ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా? పొరపాటున ఏ MIM ఎంపీ ఇచ్చి ఉంటే ఏం చేసేవారు? పార్లమెంట్ నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అని నా అనుమానం.
Also Read: USA: హిందూ ఆలయంపై దాడి.. ఖలిస్తానీ అనుకూల నినాదాలు..
ఎన్నికల్లో లబ్ధి కోసం చేసిన నాటకీయ ప్రక్రియ అనిపిస్తోంది. లేదంటే ఎంత సీరియస్ గా వ్యవహరించాలి? అటువంటిదేమీ కనిపించడం లేదే? ఎన్నికల గిమ్మిక్ లో భాగంగానే ప్రమాదకర గేమ్ అడారు. ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుంది కాబట్టి ఇలా చేస్తున్నారు. రామజన్మభూమి ఆలయానికి వ్యూహాత్మకంగా అందరినీ పిలిచారు. బాబ్రీ మసీదు కూలగొట్టడానికి ఆద్యుడు ఎల్కే అద్వానీ. కానీ ఆయన్ను రానివ్వడం లేదు. ఆయనొస్తే పేరు ఆయనకే వెళ్తుంది. అది మోడీకి ఇష్టం లేదు. అందుకే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి ఆహ్వానం లేదు. ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేశామని గోల చేస్తున్నారు. అది ఒక కళ. ఇండియా కూటమి పొత్తులు తెలంగాణలో విజయం సాధించాయి.
ఏపీలో పార్టీలు అన్నీ కేంద్ర హోంమంత్రిని, బీజేపీని చూసి భయపడుతున్నాయి. మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తారో అని వారంతా భయపడుతున్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే మా పొత్తులు ఉంటాయి. బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపే. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరు. జగన్ కి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్ళాలి అన్నది మా ఉద్దేశం. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం. పోల్ మేనేజ్‌మెంట్‌కు భయపడే వారు బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్నారు’ అని అన్నారు.