కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మొదట రెండు వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారత ప్రభుత్వం.. ప్రస్తుతం.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నారు.. అయితే, కోవాగ్జిన్ సమర్థతపై కీలక ప్రకటన చేసింది ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది.. కొత్త వేరియంట్లను కూడా లోకల్ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుందని తెలిపింది.. భారత వైద్య పరిశోధన మండలి.. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని, సార్స్-కోవ్-2కు చెందిన వేర్వేరు రూపాలను నిర్వీర్యం చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
ఐసీఎంఆర్ ఇవాళ సోషల్ మీడియా వేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 (సార్స్-కోవ్-2)కు చెందిన వివిధ రూపాలను కోవాగ్జిన్ ధ్వంసం చేసినట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను కూడా సమర్థవంతంగా నాశనం చేసినట్లు వెల్లడైంది. యూకే వేరియెంట్, బ్రెజిల్ వేరియెంట్‌లపై కోవాగ్జిన్ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్-ఎన్ఐవీ వివరించాయి. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ బి.1.617 సార్స్-కోవ్-2ను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపాయి. ఇక, కోవాగ్జిన్ పనితీరుపై మధ్యంతర ఫలితాలు కూడా వెల్లడించింది భారత్ బయోటిక్.. ఈ ఫలితాల్లో టీకా 78 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది.. సీరియస్ కేసుల్లో 100 శాతం సమర్థవంతంగా కోవాగ్జిన్ పనిచేస్తోందని వెల్లడించింది.. త్వరలోనే కోవాగ్జిన్ తుది దశ ఫలితాలను ప్రకటించనున్నారు.