Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడెవరో ఈ రోజు తేలనుంది. దాదాపుగా 20 ఏళ్ల తరువాత మొదటిసారిగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గాంధీయేతర కుటుంబ నుంచి అధ్యక్షుడు రాబోతున్నారు. అక్టోబర్ 17న జరిగిన పోలింగ్ లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. ఇప్పటికే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి దేశంలో పలు రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు చేరాయి. అక్కడకు తరలించిన వాటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.
దేశవ్యాప్తంగా 38 పోలింగ్ కేంద్రాలు, 68 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కౌంటింగ్ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు దేశ రాజధానికి వెళుతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు సీనియర్ నేతలు ఢిల్లీకి రానున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీ ప్రధాన కార్యాలయం ముందు మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి భారీ పోస్టర్లను ఏర్పాటు చేశారు.
Read Also: Sivakarthikeyan: విజయ్‌తో శివకార్తికేయన్ మల్టీస్టారర్ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
దాదాపుగా 9,900 మంది పార్టీ ప్రతినిధులు ఉంటే 9,477 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 96 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సగాని కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించనున్నారు. 4,740 ఓట్లు ఏ అభ్యర్ధికైతే వస్తాయో, ఆ తర్వాత వెనువెంటనే ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కౌంటింగ్ సమయంలో ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ పేపర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలియనుంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి అభ్యర్థుల ఎంపికలో చాలా హైడ్రామా జరిగింది. ముందుగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించాలని మొదట గాంధీ కుటుంబం భావించింది. అయితే ఆయన ససేమిరా అనడంతో చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గే పేరును తీసుకువచ్చారు. శశిథరూర్, ఖర్గేలు ఇద్దరు పోటీ పడ్డారు. అయితే ఖర్గేనే అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పార్టీలోని యువఓటర్లు మాత్రం శశిథరూర్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దళిత కార్డు, కర్ణాటక ఎన్నికల దృష్ట్యా ఖర్గేను తెరపైకి తీసుకువచ్చింది కాంగ్రెస్.