JaiShankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే ప్రాంతంలోని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదం చెలరేగింది. పలు సందర్భాల్లో కెనడా, భారత దేశాన్ని కావాలనే కవ్విస్తోంది. ఇటీవల కూడా భారత్ లో కెనడా ప్రజలు భద్రంగా లేరని చెబుతూ వారికి ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారత్ లోని 41 మంది కెనడా దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను కోరింది. ఒకవేళ గడువులోగా ఉపసంహరించుకోకపోతే వారికి అందించే డిప్లమాటిక్ రక్షణల్ని తీసేస్తామని చెప్పింది.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడియన్ సిబ్బంది న్యూఢిల్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, కెనడియన్ దౌత్యపరమైన ఉనికిని తగ్గించడానికి, దౌత్యపరమైన సమానత్వం కోసమే 41 మంది కెనడియన్ దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కోరామని జైశంకర్ అన్నారు. కెనడియన్ సిబ్బంది మా వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకోవడం మాకు ఆందోళన కలిగిస్తోందని, అందుకే మేం ఇరు దేశాల దౌత్యవ్యవహారాల్లో సమానత్వం ప్రారంభించామని వెల్లడించారు. వియన్నా కన్వెన్షన్ నిబంధనలు దౌత్యపరమైన సమానత్వాన్ని అందించిందని స్పష్టం చేశారు. భారతదేశానికి కెనడియన్ రాజకీయాలలోని కొన్ని విభాగాలతో సమస్యలు ఉన్నాయని తెలిపారు.
Read Also: Israel-Hamas War: హమాస్ తీవ్రవాదులను వేటాడేందుకు ఇజ్రాయిల్ స్పెషల్ యూనిట్..
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో పాటు సీనియర్ భారత దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతిగా భారత్ కూడా సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. అయితే భారత్, కెనడా చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది. కెనడా అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తోందని, ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని తర్వాత భారత్, కెనడాల్లో దౌత్యపరమైన సమానత్వం కోసం ఇండియాలో ఎక్కువగా ఉన్న 41 మంది కెనడా దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కోరింది. దీంతో ప్రస్తుతం ఇండియా, కెనడాల్లో సరిసమానంగా 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు.