కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే బాధ్యత మీదే అంటూ హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే దీనికి నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగితే కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్ గురువారం అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని.. ఈ నిరసనలపై కాంగ్రెస్ నేతలపై కేసులు బుక్ చేయడానికి ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో చర్చిస్తానని అన్నారు.
నిరసనలు చేయాలంటే ఫ్రీడం పార్క్ లో చేయండి కానీ ప్రజలను కూడగట్టి రోడ్లపై ధర్నాలు చేయడం సరికాదని.. ఈ రోజు ఛలో రాజ్ భవన్ నిరసనలకు దిగుతున్నారని.. సీఎం బొమ్మైని కలిసి కోవిడ్ ప్రోటోకాల్ పై చర్చిస్తామని.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ టెక్నికల్ టీమ్ కర్ణాటకలో కోవిడ్ నివేదిక ఇచ్చింది. జూన్ మూడో వారం నుంచి అక్టోబర్ వరకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని వారు అంచనా వేశారు. ఇదిలా ఉంటే మంత్రి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఫైర్ అయ్యారు. ముందుగా కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన బీజేపీ నేతలపై కేసులు పెట్టండి అని సవాల్ విసిరారు.