Hanuman Flag: కర్ణాటకలో మరో వివాదం చెలరేగింది. మాండ్యా జిల్లాలో అధికారులు హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. జిల్లాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. గ్రామస్తులంతా ప్రభుత్వానికి, అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన, ఆందోళనలకు దిగారు. నిన్న ప్రారంభమైన ఈ ఆందోళనలు, ఈ రోజు కూడా కొనసాగించేందు ప్లాన్ చేశారు.
Read Also: Tamannaah: ఫైనల్ గా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్క్ బ్యూటీ.. పెళ్లి అప్పుడేనా?
గ్రామంలో ధ్వజస్తంభం ఏర్పాటుకు గ్రామపంచాయతీ అనుమతించింది. అయితే, హనుమాన్ చిత్రం ఉన్న కాషాయ జెండాను ఎగరేయడంపై పలువురు ఫిర్యాదు చేయడంతో, అధికారులు ఈ జెండాను తొలగించారు. దీంతో గ్రామస్తులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 144 సెక్షన్ విధించారు. దీనిపై బీజేపీ, జేడీఎస్ నాయకులు గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు. ఈ మొత్తం ఘర్షణకు కాంగ్రెస్ కారణమని నిందించారు.
నిరసనల్లో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ బ్యానర్లను ధ్వంసం చేయడంతో వివాదం మరింతగా ముదిరింది. జెండా తొలగింపును హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మాండ్యాలో జరిగిన ఈ నిరసనలు కర్ణాటక వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. ఈరోజు బెంగళూరులోని మైసూరు బ్యాంక్ సర్కిల్‌లో, ఇతర జిల్లాల్లో నిరసన చేపట్టాలని బీజేపీ యోచిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. పంచాయతీ అనుమతితోనే హనుమాన్ జెండాను ఎగరేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం హఠాత్తుగా జెండాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మరోవైపు ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. జాతీయ జెండాకు బదులు కాషాయ జెండాను ఎగరేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.