Congress: బీజేపీపై మరింతగా దాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందని, రాజ్యాంగాన్ని అణగదొక్కారని ఆరోపిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’’ పేరుతో 13 నెలల ప్రచారాన్ని కాంగ్రెస్ గురువారం ప్రకటించింది. డిసెంబర్ 27న కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో, దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
Read Also: Vizag New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలు.. గైడ్‌లైన్స్ విడుదల చేసిన వైజాగ్ సీపీ
“ప్రచారంలో పాదయాత్రలు, గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాలీలు ఉంటాయి. జాతీయ, రాష్ట్ర, జిల్లా మరియు అట్టడుగు స్థాయిలలోని అన్ని స్థాయిల నాయకులు దీనికి నాయకత్వం వహిస్తారు. సెమినార్లు వంటి కార్యకలాపాలు, బహిరంగ సభలు, ర్యాలీలు ఒక గ్రామం నుంచి మరో గ్రామం వరకు జరుగుతాయి” అని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలోనే, కాంగ్రెస్ 2025 జనవరి 26న ఏడాదిపాటు ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను ప్రారంభించనుందని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు.
బీఆర్ అంబేద్కర్‌ని బీజేపీ అవమానపరిచిందని , పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ రాజ్యాంగాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారానికి కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ మాత్రం అంబేద్కర్ వ్యాఖ్యల వివాదంపై కాంగ్రెస్ తీరును తప్పుబడుతోంది. అంబేద్కర్‌ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ దుయ్యబడుతోంది.