Karnataka: కర్ణాటక ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టేందుకు ససేమిరా అంటున్నారు. కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాలో ఇదే విధంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో విద్యుత్ అధికారులు గ్రామాల్లో బిల్లులు వసూలు చేసేందుకు వెళ్లిన సమయంలో తాము బిల్లులు కట్టం అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు.
Read Also: IND vs PAK : టీమిండియా-పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ కు ప్లాన్..?
అయితే ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది. అయితే పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొప్పల్, కలబురిగి, చిత్రదుర్గ వంటి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో విద్యుత్ అధికారులకు ఇలాంటి సమాధానాలే విద్యుత్ అధికారులకు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మా బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు మీటర్ రీడింగ్ చేసేందుకు గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారు. చిత్రదుర్గలో ఓ మహిళకు బిల్లు అందచేయగా.. ఆమె బిల్లు చెల్లించేందుకు నిరాకరించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఓటేశానని, అప్పటి నుంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీకి అర్హురాలినని చెప్పింది. మా బిల్లులను సిద్దరామయ్య, డీకే శివకుమార్ చెల్లిస్తారని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత నుంచి 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నారు కాబట్టి ఇటువైపు రావద్దని హెచ్చరిస్తున్నారు.
కర్ణాటకలో మొత్తం 1.9 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వీరంతా 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీని వాడుకుంటే నెలకు 3,845 మిలియన్ యూనిట్లు అవుతుంది. ప్రస్తుతం యూనిట్ కు రూ. 8.75 అనుకున్నా.. నెలకు రూ. 3,367 కోట్లు అవుతుంది. అంటే ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై రూ. 44,404 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ ఇందులో సగం కుటుంబాలు ఈ హామీ పరిధి కిందకు వచ్చినా.. ఏడాదికి రూ. 20,000 కోట్లు ఖర్చు అవుతుంది.