BJP: పహల్గామ్ దాడి తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇప్పటికే, కొందరు నేతలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ‘‘హిందువులు’’ అని అడిగి చంపలేదు అని అన్నారు. తాజాగా, పంజాబ్ మాజీ సీఎం, ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న చరణ్‌జీత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శనివారం, బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ భారత సాయుధ దళాలను నిరాశ పరుస్తోందని, తమ రాజకీయ ప్రకటనల ద్వారా పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
‘‘బయటకు, ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కావచ్చు, కానీ లోపల, ఇది పాకిస్తాన్ వర్కింగ్ కమిటీ (PWC)’’ అని దుయ్యబట్టారు. పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా 2019లో భారత సాయుధ దళం నిర్వహించిన ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ ప్రామాణికతను కాంగ్రెస్ ఎంపీ చరణ్ జీత్ సింగ్ చన్నీ ప్రశ్నించడాన్ని సంబిత్ పాత్ర విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ, దాని వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించింది. చన్నీ సర్జికల్ స్ట్రైక్స్ ఉనికిపై సందేహాన్ని వ్యక్తి చేశాడు. ఇది బాధ్యతారహితం మాత్రమే కాదు, ప్రమాదకరమైనవి’’ అని సంబిత్ పాత్ర అన్నారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద దాడులను తీవ్రంగా పరిగణించకపోయినా, దేశ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గాంధీ కుటుంబం పట్టించుకోకపోయినా, దేశ సాయుధ దళాలను పదే పదే నిరాశపరిచే లేదా ప్రజల మనోభావాలతో ఆడుకునే స్వేచ్ఛ వారికి లేదు’’ అని అన్నారు.
ఇదే కాకుండా, ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఒక ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సెనెటర్ సమాజ్‌వాదీ పార్టీ, ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ని ప్రశంసించడాన్ని కూడా సంబిత్ పాత్ర ప్రస్తావించారు. అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు ఉగ్రవాదాన్ని ఖండించడం కన్నా ప్రధాని మోడీని విమర్శించినందుకు పాక్ సెనెటర్ సైఫుల్లా అబ్రో ప్రశంసించారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆక్సిజన్ అందిస్తోందని అన్నారు. కాంగ్రెస్ భారతదేశంలో పాకిస్తాన్ భాషను ఎందుకు మాట్లాడుతుందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.