CWC Meeting: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) గురువారం భేటీ కాబోతోంది. రేపు సాయంత్రం 5.30 నిమిషాలకు సోనియా అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రేపు జరగబోయే సీడబ్ల్యూసీ మీటింగ్ లో అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న ఢిల్లీలో రాంలీలా మైదానంలో నిర్వహించబోతోన్న ర్యాలీ గురించి కూడా చర్చించనున్నారు. దీంతో పాటు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న ‘‘ భారత్ జోడో’’ యాత్రపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. ముందుగా అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్ర అనుకున్నారు. అయితే.. దీన్ని ముందుగానే ప్రారంభించాలని సెప్టెంబర్ 7కు మార్చారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధం అయింది. దేశ వ్యాప్తంగా మొత్తం 3571 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. మొత్తం 148 రోజుల పాటు 68 లోక్ సభ నియోజకవర్గాల్లో 203 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఏపీలో మొత్తం 100 కిలోమీటర్ల మేర..4 రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగనుంది. ఏపీలో రెండు లోక్ సభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా పాదయాత్ర కొనసాగుతుంది. కన్యాకుమారి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఆలూరు, తెలంగాణలోని వికారాబాద్ గుండా జమ్మూ వరకు 20 ప్రధాన నగరాలు, పట్టణాలు గుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగనుంది.
Read Also: National Anthem: జాతీయ గీతం పాడుతూ మధ్యలో మరిచిపోయిన ఎంపీ.. వైరల్ అవుతున్న వీడియో
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి గత కొంత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. పూర్తి స్థాయి బాధ్యతలను వేరేవారికి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోరుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు ఉంటాయని భావించారు. ఇందు కోసం రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ‘ చింతన్ శిబిర్’ నిర్వహించింది. అయితే ఆ సమయంలో కూడా పెద్దగా రాజకీయ నిర్ణయాలు తీసుకోలేదు. తాజాగా ఈ సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఏదో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.